- నీటి భద్రత, ప్రకృతి సేద్యం, టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సహాయం
- ఈ పంచ సూత్రాలతో రైతును రాజుగా చేస్తాం
- ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలి
- ఆర్థిక ఇబ్బందులున్నా.. ఆగని రైతు సంక్షేమం
- సీఎం చంద్రబాబు విజన్ వల్లే పదేళ్లుగా కృష్ణా డెల్టాకు పుష్కలంగా నీరు
- రైతన్నా.. మీకోసం కార్య్రక్రమం ప్రారంభోత్సవంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ఘంటశాల/కృష్ణాజిల్లా (చైతన్యరథం): రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం కృష్ణాజిల్లా, ఆవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటశాల గ్రామంలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డా.మండలి బుద్ధప్రసాద్‌తో కలసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘంటశాల గ్రామంలో రైతులకు పంచసూత్ర ప్రణాళిక ఉద్దేశాన్ని, ఉపయోగాలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ముఖ్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29 వరకూ ‘‘రైతన్నా మీకోసం’’ పేరుతో కార్యక్రమాలు చేపడతున్నామని, డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రైతు నిలబడేలా, వ్యవసాయం కొనసాగించేలా ఒక వ్యవస్థ ఉండాలి.. రైతుకి భరోసా ఇవ్వగల శాశ్వత పరిష్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకు వస్తున్నారు. అదే ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలి
రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉండటంతో, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతు బలపడితేనే గ్రామం బలపడుతుంది. గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. అందుకే ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని తెలిపారు. రైతు ఆదాయం పెంపు, పెట్టుబడి వ్యయాల తగ్గింపు, పంటలకు గిట్టుబాటు ధర, ప్రకృతి విపత్తుల్లో రక్షణ, మార్కెట్ స్థిరీకరణ, శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అందుబాటు లోన్లు, పంట బీమా, నీటి వనరుల మెరుగుదల, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, రైతు సేవా కేంద్రాల బలోపేతం వంటి చర్యలు.. రైతు కుటుంబాల అభివృద్ధి వైపు స్పష్టమైన అడుగులని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు స్వయం సమృద్ధి సాధించే పరిస్థితులను క్రమబద్ధంగా తీసుకువస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రతి రైతు ఇంటికి పంచసూత్రాల ప్రచారం
పంచసూత్రాలను ప్రతి రైతు ఇంటికి వెళ్లి, కనీసం 20 నిమిషాల పాటు వివరించేందుకు ఈ భారీ కార్యక్రమం చేపట్టామని మంత్రి వెల్లడిరచారు. ఈ పంచసూత్రాలు ఏమిటి.. రైతుకి ఎలా మేలు జరుగుతుంది.. భవిష్యత్తులో ఎలా స్థిర ఆదాయం వస్తుంది.. ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం ఎలా ముందుకు సాగుతుంది.. అనే విషయాలు ప్రతి రైతుకు స్పష్టంగా చెప్పడం తమ లక్ష్యమని తెలిపారు. నీటి పారుదల, రైతు అభివృద్ధికి మొదటి అస్త్రం. వ్యవసాయం చేయాలంటే ముందుగా నీరు అవసరం. నీరు లేకపోతే రైతుకు కష్టమే. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సాగు నీటి రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లే పదేళ్లుగా కృష్ణా డెల్టాకు పుష్కలంగా నీరందుతోందన్నారు. నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబుల హయాంలో నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, వారి కృషి వల్లనే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలినవన్నీ వేగంగా సాగుతున్నాయని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పంటలు పండిరచేటప్పుడు డిమాండ్ ఆలోచించకుండా పక్క రైతులను అనుసరించటం, గత సంవత్సరం ధర వచ్చిన పంటను మళ్లీ సాగు చేయటం వల్ల నష్టం వస్తోందని మంత్రి చెప్పారు. ప్రజల ఆహార అలవాట్లు పూర్తిగా మారాయన్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు మళ్లీ డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్యకర ధాన్యాలని, ఈ మార్పును రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతన్నా.. మీకోసం కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలి, ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యాచరణ ప్రణాళిక అమలుచేయాలని మంత్రి ఆదేశించారు.
యాంత్రీకరణ తప్పనిసరి
వ్యవసాయంలో కూలీల ఖర్చులు పెరుగుతున్నాయని, అందుకే యాంత్రీకరణ తప్పనిసరి అని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ట్రాక్టర్ కనిపించినా ఆశ్చర్యపోయేవాళ్లం, ఇప్పుడు ప్రతి గ్రామంలో యాంత్రీకరణే ఆధారం. కోత నుండి మోత వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు సేవా కేంద్రాలలో అన్ని యాంత్రీకరణ పరికరాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, రైతులు వీటిని వినియోగిస్తేనే లాభాలు ఎక్కువగా వస్తాయన్నారు. డ్రోన్ల ద్వారా మందు పిచికారీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో డ్రోన్ ద్వారా ఏ ఎకరాలో ఏ వ్యాధి వచ్చిందో గుర్తించి, అదే ప్రాంతంలో అవసరమైన మందును మాత్రమే పిచికారీ చేసేలా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారని, ఇది రైతు ఖర్చులు తగ్గించి, దిగుబడిని పెంచే విధానం అన్నారు. పంట పండిస్తే సరిపోదు. స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతుకి లాభం వస్తుందని మంత్రి చెప్పారు.
రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు
రైతన్నా మీకోసం కార్యక్రమం రైతులను రోడ్డు మీద పడేస్తుందని పులివెందుల ఎమ్మెల్యే జగన్ అనడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి ఈ రోజు కూటమి ప్రభుత్వంపై అర్థంలేని మాటలు మాట్లాడటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాలను ఛిన్నాభిన్నం చేసిన జగన్ అభివృద్ధి గురించి ప్రశ్నించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రైతుపై భారం మోపలేదని, 18 మాసాల్లో రైతు పక్షాన అనేక కార్యక్రమాలు చేపట్టినా కూడా జగన్ కళ్లకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. అధిక దిగుబడులు వచ్చినా ధరలు రాక రైతులకి ఎదురైన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. బడ్జెట్‌లో రూ.300 కోట్లు పెట్టినా, అవసరాన్ని బట్టి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేసి రైతు పంటలు కొనుగోలు చేశామన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. వ్యవసాయ శాఖ అభివృద్ధిపై జగన్ బహిరంగ చర్చకు రావాలని, లేదా అసెంబ్లీకి వస్తే చర్చించుకుందామని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో ఆవనిగడ్డ ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటర్ బీ.రాజశేఖర్ (ఎక్స్ అఫీషియో), వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీర్ జిలానీ సామూన్, కృష్ణా జిల్లా జేసీ ఎం. నవీన్, ఆర్టీస్ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఆంగ్రూ ప్రతినిధులు డా. శివన్నారాయణ, డా. దుర్గా ప్రసాద్, విజ్ఞాన్ కృషి కేంద్ర సీనియర్ సైంటిస్ట్ డా.డి. సుధారాణి, ఘంటశాల గ్రామస్తులు, కూటమి ప్రభుత్వ శ్రేణులు పాల్గొన్నారు.













