- గ్రామసభల ఆమోదంతోనే పనులు… నరేగాకూ ఇదే నిబంధన
- ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలి
- వాతావరణం సహా 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్ విడుదల
- రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని.. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరేగా పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అంశాలను సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవటంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించటం ద్వారానే దీనిని సాధించవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతీ అంశంలోనూ జవాబుదారీతనం అనేది కీలకమైన అంశంగా పరిగణించాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకూ విశ్లేషణ జరగాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఉత్పన్నమైన మొక్క జొన్న, పత్తి, అరటి పంటల సమస్యను పరిష్కరించి రైతులకు మంచి ధర దక్కేలా చేస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖలు ఆర్థిక, ఆర్థికేతర అంశాల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
త్వరలో ప్రజలకు అందుబాటులోకి అవేర్ యాప్
వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్‌ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిని త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్ కు అనుసంధానం కావాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. దీనిపై ఓ యాప్ రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లు ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అధికారుల్లోనూ పాలనా సామర్థ్యాలు పెరిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు.













