అమరావతి (చైతన్యరథం): బాలీవుడ్ నటుడు ధర్మేంధ్ర మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ధర్మేంద్ర మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన దిగ్గజ నటుడు, తన మరపురాని నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి తరతరాలుగా గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానన్నారు.
హీ మ్యాన్ అంటే ధర్మేంద్ర: డిప్యూటీ సీఎం పవన్
ధర్మేంద్ర మృతిపట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు. ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. హిందీ చిత్రసీమలో తొలి తరం యాక్షన్ హీరోగా ధర్మేంద్ర అలరించారు. యాక్షన్ కింగ్, హీ మ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారు. షోలే వంటి హిట్ చిత్రాలతో నటననలో తనదైన శైలి కనబరిచారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
భారతీయ సినిమాకు ఐకాన్: మంత్రి లోకేష్
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వెలిబుచ్చారు. భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌గా నిలిచిన ఆయన 1960లో తన అరంగేట్రం నుండి షోలే వంటి మరపురాని క్లాసిక్‌ల వరకు అన్ని తరాల మనసులను గెలుచుకున్నారన్నారు. 300కి పైగా చిత్రాల్లో చూపిన అసమాన ప్రతిభ.. ఆయనకు పద్మభూషణ్ పురస్కారంతో పాటు, లక్షలాది మంది హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయన్నారు.
సినీ చరిత్రలో ఆయన స్థానం శాశ్వతం: బాలకృష్ణ
భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజం, కాలాతీత ఐకాన్, గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ధర్మేంద్ర మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని అగ్రనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. భారత సినీ పరిశ్రమకు స్ఫూర్తిగా నిలిచిన నటుడు ధర్మేంద్ర అన్నారు. అభినయంలో ఓ శిఖరం.. ఎంతో ఎత్తుకు ఎదిగినా వినయానికి నిదర్శనం.. లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు..బాలీవుడ్ హీ-మ్యాన్ మాత్రమే కాదు.. బంగారు మనసున్న వ్యక్తి ధర్మేంద్ర. లెజెండ్స్ ఎప్పుడూ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారు. ఆయన కుటుంబం, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన వంటి దిగ్గజాలు మన హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు.













