- సేవా కార్యక్రమాలకు నెలవు ప్రశాంతి నిలయం
- అనంతపురంలో తాగునీటి ఎద్దడి తీర్చారు
- దేశ విదేశాల్లో అభిమానులు, భక్తులు
- సత్యసాయి శత జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్యరథం): శ్రీసత్యసాయి బాబా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆదివారం మంత్రి పాల్గొని పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సత్యసాయి జయంతిని నిర్వహించడం హర్షణీయం అన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా అనేక మంది ప్రముఖులు పుట్టపర్తిని దర్శించుకోవడం మన రాష్ట్రానికే గర్వకారణం. సత్యసాయి లాంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు వారు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.
సత్యసాయి బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శప్రాయం. ఎడారిగా ఉండే అనంతపురం ప్రాంతానికి తాగునీరు తెప్పించిన ఘనత ఆయనదే. స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణతో పేదలకు అండగా నిలిచారు. ఆయన ప్రారంభించిన సేవలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కొనసాగిస్తోంది. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం పేరుకు తగ్గట్లుగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ వాతావరణంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అందుకే దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. సత్యసాయి బాబా ట్రస్టు సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.












