పుట్టపర్తి (చైతన్యరథం): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో పాటు సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మందిరం నుంచి స్వర్ణరథంపై సత్యసాయి ప్రతిమను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు నిర్వాహకులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చిత్రపటాన్ని బహూకరించారు. అంతకుముందు ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని మంత్రి దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ కె.చక్రవర్తి, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
శత జయంతి వేడుకల సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తోన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, మంత్రులు ఆసక్తిగా తిలకించారు. సత్యసాయి బాబా ప్రవచనాలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా థీమ్‌లతో చిన్నారుల నాట్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.












