- రైల్వే వ్యాగన్ల ద్వారా ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించండి
- పత్తి రైతుల్ని ఆదుకోవాలని కేంద్రానికి లేఖ
- ధరల స్థిరీకరణ నిధి ద్వారా మొక్కజొన్న రైతును ఆదుకునేందుకు చర్యలు
- అరటి, పత్తి, మొక్కజొన్న పంటలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
పుట్టపర్తి (చైతన్యరథం): రాయలసీమలో పండిన
అరటిని ముంబై లాంటి మార్కెట్లకు తరలించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ముంబై, కోల్కతా లాంటి ప్రాంతాలకు తరలించి అక్కడి మార్కెట్లలో విక్రయించాలని సూచించారు. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి ముఖ్యమంత్రి శనివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. అరటి ధరలు, కొనుగోళ్లపై ప్రతీ రోజూ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు అరటి లోడుతో కూడిన రైల్వే వ్యాగన్లను పంపేందుకు చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం రాయలసీమలో 40 వేల హెక్టార్లలో అరటి ఉత్పత్తి అవుతోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
డిసెంబరు మొదటి వారం నుంచి అరటి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే అప్పటి వరకూ అరటి రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాయలసీమలో పండిన అరటిని రవాణా చేసేందుకు ఓ ఏజెన్సీ ముందుకు వచ్చిందని అధికారులు వివరించారు. ఎప్పటికప్పుడు అరటిని రవాణా చేసేందుకు ఓ ప్రణాళికను రూపొందించు కోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇక పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. మొక్కజొన్న రైతులనూ ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. మొక్క జొన్న మద్దతు ధర కంటే తక్కువ రేటు పలుతున్నందున వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈసారి 1.42 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్నను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుచేయాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించేందుకు ప్రయోగాత్మకంగా కొనుగోళ్లు చేపట్టాలని పేర్కొన్నారు. అది సత్ఫలితాలు ఇస్తే మొక్క జొన్న కొనుగోళ్లకు సమస్య ఎదురైనప్పుడు దానిని ఆచరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ
పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రతీ రోజూ తనిఖీ చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి సమస్యల్ని -పరిష్కరించాలని సూచించారు. రంగుమారిన, తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాగల రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్లాట్ బుకింగ్ సమస్యను పరిష్కరించిందని అధికారులు వివరించారు. సమీపంలోని జిన్నింగ్ మిల్లులకే పత్తిని రవాణా చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తేమ శాతం లాంటి సీసీఐ నిబంధనల కారణంగా పత్తి రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.














