- ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ
- పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయి ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుంది
- లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే బాబా నినాదాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి
- శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్
పుట్టపర్తి (చైతన్యరథం): విలువలతో కూడిన విద్య శ్రీసత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శనివారం శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్) 44వ స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో పాటు గౌరవ అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇక్కడకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నానన్నారు. ప్రశాంతి నిలయం, రాయలసీమ పవిత్ర భూమిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మీ ముందు మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయి బాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుంది. ఆయన సేవా కార్యక్రమాలు దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని చేరాయి. దూర ప్రాంతాలకు తాగునీటి సరఫరా కార్యక్రమాలు, వేలాది మందికి వైద్యసేవలు అందించడంతో పాటు లక్షలాది మందికి బాబా అనుగ్రహించిన దైవిక, ప్రేమ, ఆధ్యాత్మిక అనుభూతులు దేశం నలుమూలలా వ్యాపించాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాం. అణుకువ, నిజాయతీ, ప్రజాసేవ పట్ల అంకితభావానికి ఆయన ప్రతిరూపం. ప్రజాసేవతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఉప రాష్ట్రపతిస్థాయి వరకు చేరడం ఇక్కడున్న ప్రతి గ్రాడ్యుయేటు ప్రేరణగా నిలుస్తుంది. రాయలసీమ అనేది ధైర్యం, నిరాండబరత, త్యాగానికి ప్రతీక, ఆధ్యాత్మిక కాంతి కలిగిన పవిత్ర భూమి. ఈ నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మించారు. బాబా దర్శనం, దృష్టి, కరుణ ఈ విశ్వవిద్యాలయానికే కాదు… ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఈ పవిత్ర మట్టిలోనే ఆధ్యాత్మికత, నిరాడంబరత, త్యాగం నిండి ఉన్నాయి. అలాంటి నేలపై ఉన్న ఈ విశ్వవిద్యాలయం బాబా దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదో ఆధునిక గురుకులం. ఇక్కడున్న విద్యార్థులు కేవలం అర్హతలతో కాదు.. వ్యక్తిత్వంతో ఉన్న పట్టభద్రులు, కేవలం ఆకాంక్షలతో కాదు.. దయతో ఉన్న నాయకులు, కేవలం నైపుణ్యంతో కాదు.. ప్రయోజనంతో పనిచేసే వృత్తిపరులు, ఇవే భారత భవిష్యత్ నాయకులకు కావాల్సిన లక్షణాలు, ఈ నేల నుంచే బాబా ప్రపంచం మెచ్చుకునే విద్యా నమూనాను నిర్మించారు. మేధస్సు, మనస్సు, ఆధ్యాత్మికత సమన్వయంతో కూడిన విద్యా విధానం. ఇది కేవలం కాలేజీ కాదు.. నాయకత్వాన్ని మలిచే పవిత్ర శిక్షణ స్థలంగా మంత్రి లోకేష్ అభివర్ణించారు.
విలువలతో కూడిన విద్య
నేడు భారతదేశం కీలక మార్పు దిశగా ముందడుగు వేస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యసాధనకు కేవలం మేధావులను కాకుండా.. స్థిరమైన, బలమైన, సేవాభావం కలిగిన వారిని తీర్చిదిద్దే విద్యాసంస్థలు అవసరం. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అలాంటి సంస్థల్లో ముందువరుసలో ఉంది. విలువతో కూడిన విద్య, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, సంపూర్ణ వ్యక్తిత్వ అభివృద్ధి, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు, క్రమశిక్షణతో కూడిన క్యాంపస్ జీవితం ఈ సంస్థ ప్రత్యేకతలు. జాతీయ విద్యా విధానం-2020తో ఈ సంస్థ పూర్తిగా అనుసంధానమై ఉంది. ఇది కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదు.. దేశానికి ఒక నైతిక ప్రమాణంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
లవ్ ఆల్, సర్వ్ ఆల్
ఇక్కడ ఉన్న అధ్యాపకులు, తల్లిదండ్రులు బాబా. విజన్ ను ముందుకు తీసుకెళ్లే జ్యోతులు. మీ అంకితభావం ఈ సంస్థ దివ్యతను కాపాడుతుంది.. మీరు ఉపాధ్యాయులు మాత్రమే కాదు.. మార్గదర్శకులు, తల్లిదండ్రులు మొదటి గురువులు. ఈ విశ్వవిద్యాలయంపై మీరు ఉంచిన విశ్వాసం, బాబా విలువలపై మీ నమ్మకానికి ప్రతీక. ఈ రోజు మీరు కేవలం ఒక డిగ్రీతో ప్రపంచంలోకి అడుగుపెట్టడం లేదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ, దైవానుగ్రహం, రాయలసీమ ప్రాంత నిజాయతీ, ధైర్యం, మీ గురువుల నమ్మకం, భారతదేశ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా బాబా ప్రవచించిన శీజవ శ్రీశ్రీ.. నావతీఙవ ూశ్రీశ్రీ, ఎవశ్రీజూ జుబివతీ.. నాబతి చీవజవతీ.. (అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి.. ఎల్లప్పుడూ సాయం అందించండి, ఎవరినీ బాధపెట్టకండి) సూక్తులను జీవితంలో భాగం చేసుకోవాలి. మీరు ఎక్కడున్నా ఎప్పటికీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ప్రశాంతి నిలయానికి రాయబారులుగా నిలవాలి. ఈ పవిత్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ముందుకు సాగండి.. ధైర్యంతో నడిపించండి, దయతో సేవ చేయండి, బలమైన భారతదేశాన్ని నిర్మించాలని, యువత రాజకీయాల్లో రావాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
అంతకుముందు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కాన్వకేషన్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ముందుగా సాయి కుల్వంత్ మందిరంలోని భగవాన్ శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఆయనకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలికారు. వివిధ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన గ్రాడ్యుయేట్లకు ఉప రాష్ట్రపతి పీసీ రాధాకృష్ణన్ గోల్డ్ మెడల్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్స్లర్ కె.చక్రవర్తి, వైస్ ఛాన్స్లర్, బి. రాఘవేంద్ర ప్రసాద్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.














