- సాధ్యమైనంత త్వరగా వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు
- విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను అనుమతించం
విద్యార్థి, యువజన సంఘాల నేతలతో మంత్రి నారా లోకేష్‌అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తామని, ఈ విషయంలో ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై వత్తిడితెస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌తో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశమైంది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.4,200 కోట్ల రూపాయలు పెండిరగ్‌లో పెట్టిందని, ఆ సొమ్మును కూడా ఆర్థిక వెసులుబాటు చూసుకొని దశలవారీగా చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని విద్యార్థి, యువజన సంఘ నేతలు మంత్రి లోకేష్‌కు సమర్పించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విద్యార్థి సంఘ నాయకులకు ఆయా విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలపై చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికకు అవకాశమిస్తామన్నారు. విద్యార్థి సంఘాలు కళాశాలల్లో నిర్వహించే యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌కు సహకరిస్తామన్నారు. అపార్ ఐడితో అనుసంధానం ద్వారా విద్యార్థుల బస్‌పాస్‌ల జారీకి సులభతరమైన విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రంలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టంచేశారు.
ఈసారి కళాశాలల్లో అడ్మిషన్లు ఆలస్యం కాకుండా తగుచర్యలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు సంబంధించిన షెడ్యూలును ఈ ఏడాదే ప్రకటిస్తామని, షెడ్యూలు ప్రకారమే సెట్‌ల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వివిధ యూనివర్సిటీల్లో మిగిలినపోయిన సీట్లకు నేరుగా అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని విద్యార్థి సంఘ నేతలు కోరగా, బేసిక్ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సిందేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 4,300 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, న్యాయపరమైన చిక్కులను అధిగమించి సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థి యువజన సంఘాల జేఏసీ మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చిన సమస్యల వివరాలిలావున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘ నేతల ప్రవేశాన్ని నిషేధిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలి. డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లను రద్దుచేసి ఆఫ్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. పేద విద్యార్థులకు పిజి విద్యను దూరంచేసే జిఓ నెం.77ని రద్దుచేయాలి. కామన్ పిజి సెట్ విధానాన్ని రద్దుచేసి ప్రతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటును నిర్మించే జిఓ నెం.107, 108లను రద్దుచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా వర్శిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలి. గత ప్రభుత్వం మూసివేసిన 2వేలకు పైగా పాఠశాలలను పునఃప్రారంభించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో సంభవిస్తున్న ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగావున్న వార్డెన్, కుక్, కమాటీ, వాచ్‌మెన్ పోస్టులను భర్తీచేయాలి.
యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి. గత ప్రభుత్వం విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఏపీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు విజ్ఞప్తిచేశారు. సమావేశంలో విఎంఆర్ డిఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్, శాప్ చైర్మన్ రవినాయుడు, కె.శివారెడ్డి, బి నాజర్ జీ, జి వాలరాజు (ఏఐఎస్‌ఎఫ్), కె.ప్రసన్న, పి.రామ్మోహన్ (ఎస్‌ఎఫ్‌ఐ), భాస్కర్, వినోద్ (పిడిఎస్‌యు), వి.శ్రీనివాసరావు (ఎన్‌ఎస్‌యుఐ), ఎల్.భానుసూరి (పిడిఎస్‌ఓ), జి.రామన్న, వై.రాము (డివైఎఫ్‌ఐ), పి.రాజేంద్రబాబు, యుగంధర్ (ఏఐవైఎఫ్) తదితరులు పాల్గొన్నారు.














