- వచ్చే విద్యాసంవత్సరం నుంచే పథకం అమలు
- కళాశాలల్లో ఆత్మహత్యల నివారణకు కమిటీలు
- 26న పాఠశాల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణ
- అనుమతిలేని ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
- విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్షలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం 3 గంటలకు పైగా లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు. ‘‘స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం కింద సాయం అందిస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యనభసిస్తున్నారని, స్వదేశంలో 88,196మంది ఉన్నత చదువులు చదువుతున్నట్టు అధికారులు వివరించారు. విదేశీ విద్య పథకం ఏవిధంగా అమలు చేయాలన్న విషయంపై కూడా సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ నియమిస్తున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయివేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో సౌకర్యాల మెరుగు, విద్యార్థులపై వత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనుమతులు లేకుండా నడిచే ప్రయివేట్ కళాశాలలపై చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ఐఐటి, ఎన్‌ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీట్లు సాధించేలా చూడాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పెర్ఫార్మెన్స్‌పై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించే విషయమై మంత్రి లోకేష్ అధికారులతో చర్చించారు. ఇటీవల మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వివిధ యూనివర్సిటీల ప్రతినిధులతో జరిపిన చర్చల పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలతో కొలాబరేషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, న్యూ క్యాజిల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ డిగ్రీలపై దృష్టి సారించాలని మంత్రి లోకేష్ సూచించారు. విశాఖలో ఎడ్యు సిటీ ఏర్పాటు, వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ, అమెరికన్ రైడర్ తరహాలో అంతర్జాతీయస్థాయి ఫ్లయింగ్ స్కూలు, ఎంఆర్‌ఓ, పైలట్ గ్రౌండ్ హ్యాండిల్, కస్టమర్ సర్వీసులను ఏర్పాటుపై దృష్టి సారించాలని, 50శాతం గ్లోబల్ వర్క్ ఫోర్స్ విశాఖనుంచే సిద్ధం కావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు మనోభీష్టమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా 26 డిప్లొమో కోర్సుల కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. గుజరాత్‌కు చెందిన నామ్ టెక్ సంస్థ రాష్ట్రంలో 3 హబ్స్ (విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు) పరిధిలో 13 స్పోక్స్‌లను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటిఐలను భారీ పరిశ్రమలతో అనుసంధానిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సమీప ఐటిఐలతో బ్లూస్టార్, అమర్ రాజా, లారస్ ల్యాబ్, డిక్సన్, హెచ్‌పిసిఎల్‌తో టైఅప్ చేశామని అన్నారు. పిఎం కౌశల్ వికాస్ యోజన కింద 21,540 మందికి షార్ట్ టెర్మ్ ట్రైనింగ్ అందించడానికి కేంద్రం నుంచి అనుమతి లభించిందని వివరించారు. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ (ఈఎస్‌సీఎస్) ఏర్పాటు చేశామని అన్నారు.
పాఠశాల విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ… విలువలతో కూడిన విద్యపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ (మాక్ అసెంబ్లీ)ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ఆ సందర్భంగానే బాలల భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరిస్తారని తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ టీచర్లను మార్చిలో సింగపూర్ పంపించి, అక్కడి బోధనా పద్ధతులపై అధ్యయనం చేయాలని కోరారు. తర్వాత వేసవిలో పాఠశాల ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌ల్యాండ్ పంపించాలన్నారు.
దేశంలోనే తొలిసారిగా యు డైస్‌తో ఎస్‌ఎస్‌సి నామినల్ రోల్స్‌ను విజయవంతంగా అనుసంధానించినట్టు చెప్పారు. నామినల్ రోల్స్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించాలని సూచించారు. గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ సర్వే ఈనెల 24నుంచి డిసెంబర్ 7వరకు ఉంటుందని వివరించారు. డిసెంబర్ 5న మెగా పీటీఎంను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. టెట్‌కు సంబంధించి ఈనెల 23తో గడువు ముగుస్తుందని, ఇప్పటివరకు 1,94,014 మంది దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్షకు సంబంధించి కేసు పురోగతిపై ఆరాతీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాల మెరుగుదల, ఫలితాల సాధనే తమ ఏకైక లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఇంటర్మీడిట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవొ గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.














