- ఉపాధ్యాయులకు హామీనిచ్చిన విద్యా మంత్రి
- లెర్నింగ్ అవుట్‌కమ్స్‌పై దృష్టిపెట్టాలని సూచన
- ఉపాధ్యాయ సంఘ నేతలతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా దృషి ్టసారించి పరిష్కరిస్తున్నామని విద్యా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై శ్రద్ధపెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌తో ఏపీటీిఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. లోకేష్ స్పందిస్తూ… గత 17 నెలల్లో 423 సమస్యలను ఫ్యాప్టో ద్వారా నా దృష్టికి తెచ్చారు. ఇందులో 200 సమస్యలు పరిష్కరించాం. 81సమస్యలు పరిష్కార యోగ్యమైనవి కావు. 72 విజ్ఞాపనలు పాలసీ మేటర్స్‌కు సంబంధించినవి. 71 సమస్యలు కోర్టుల పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశారు. వచ్చేనెలలో మెగా పీటీఎం వినా ఈ విద్యా సంవత్సరంలో మరే ఇతర విద్యేతర పనులు ఉపాధ్యాయులకు ఉండవని హామీ ఇచ్చారు. డిఇఓ, ఎంఇఓలు కేవలం లెర్నింగ్ అవుట్‌కమ్స్‌పైనే దృష్టిపెట్టాలని, వారికి సర్వీసు రూల్స్ బాధ్యతలు అప్పగించబోమని స్పష్టంచేశారు. కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీటీఎఫ్ నాయకులు మంత్రి దృష్టికి తెచ్చారు. ‘టెట్ నుంచి 2011కి ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఇన్ సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించి, కటాఫ్ మార్కులను 45శాతానికి తగ్గించాలి. 2003కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మెమో 57ని అమలుచేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను సమాంతర మాధ్యమంగా కొనసాగించాలి. మండలానికి ఒక తెలుగుమీడియం స్కూలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అమలుచేస్తున్న 9 రకాల స్కూళ్ల విధానాన్ని సమీక్షించి, 1నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి విడదీయాలి. ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టి, దశాబ్ధాలుగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
అలాగే.. ‘స్కూలు అసిస్టెంట్లను ఎంఇఓలుగా నియమించే విధానానికి స్వస్తిపలకాలి. ఎంఇఓలుగా ప్రధానోపాధ్యాయులనే నియమించాలి. జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులను కూడా నియమించాలి. క్లస్టర్లలో ఖాళీగా ఉన్న టీచర్లను అధికసంఖ్యలో విద్యార్థులు గల పాఠశాలల్లో నియమించాలి. ఐటిడిఏలలో పండిట్ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలి. కెజిబివిల్లో టీచర్లకు టైమ్ స్కేల్ ఇవ్వాలి. మోడల్ స్కూలు ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించి, గవర్నమెంట్, జిల్లాపరిషత్ వారితో సమానంగా విధివిధానాలు అమలుచేయాలి. పరీక్షలు దగ్గరపడుతున్నందున 2025లో బదిలీల్లో ఖాళీ అయిన సబ్జెక్ట్ టీచర్ పోస్టుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్రతి మూడు నెలలకోసారి ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. అసెస్‌మెంట్ పుస్తకాలకు సంబంధించి మార్కులను అప్‌లోడ్ చేయడం భారంగా మారింది. దీనిని పునఃసమీక్షించాలి. ఉపాధ్యాయులను బోధనేతర పనులనుంచి మినహాయించాలి. యాప్‌ల అప్‌లోడ్ భారాన్ని తగ్గించాలి. ప్లస్ 2 పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్, పీఈటీ పోస్టులను భర్తీచేయాలి. 78సంవత్సరాల సుదీర్ఘ చరిత్రవున్న ఏపీటీఎఫ్‌కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పించాలి’ అని కోరారు. ఏపీటీఎఫ్ నేతల విజ్ఞాపనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.














