- నితీష్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి లోకేష్ తో కలిసి హాజరు
- హాజరవుతున్న ప్రధాని మోదీ, కేంద్ర కేబినెట్, ఎన్డీయే సీఎంలు
అమరావతి (చైతన్య రథం): బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లకు ఆహ్వానం అందింది.నవంబర్ 20న చంద్రబాబు, లోకేష్ బిహార్ వెళ్లనున్నారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రచారం నిర్వహించడం తెలిసిందే. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన వివరాలను బీహార్లోని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా వివరించారు.
243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 14న లెక్కించారు. ఎన్నికల్లో బిహార్ ఓటరు ఎన్డీయేకు వరుసగా మరోసారి పట్టంగట్టారు. జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకోసం రాజధాని పాట్నాలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్టీల అధినేతలు, మిత్ర పక్షాలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఆయన కేబినెట్ సహచరులంతా హాజరువుతారని సమాచారం. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీఎత్తున ప్రముఖులు వస్తుండడంతో.. పాట్నాలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.











