- విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి 73వ రోజు ప్రజాదర్బార్
- ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. నకిలీ పత్రాలతో కొంతమంది వ్యక్తులు తమ 5.64 ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చిననడిపిల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు.. మంత్రి లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం కల్పించి తమకు అండగా నిలవాలని ‘నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్‌జండర్ పర్సన్స్’ ప్రతినిధులు విన్నవించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెంలోని తమ 3.10 ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖకు చెందిన ఎన్.నరసింహస్వామి ఫిర్యాదు చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.













