- స్వదేశీ సైబర్ సెక్యూరిటీ నిపుణులను మేమే తయారు చేస్తాం
- వరల్డ్ ఎకనమిక్ ఫోరం సీఎఫ్‌టీ ఎండీ జెరేమి జుర్గెన్స్‌కు మంత్రి లోకేష్ వినతి
విశాఖపట్నం (చైతన్యరథం): గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్యూఈఎఫ్) సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ (సీఎఫ్‌టీ) మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. విశాఖ సీఐఐ సమ్మిట్ సందర్భంగా జెరెమీ జుర్గెన్స్‌తో శనివారం మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2070 నాటికి భారత్ నెట్-జీరో ఉద్గారాలు సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. 2040 నాటికి దేశంలో విద్యుత్ అవసరం రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో బలమైన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థను నిర్మించడం అత్యవసరం. ఆంధ్రప్రదేశ్‌లో మేము మార్పుకోసం ఎదురుచూడటం లేదు. మార్పును తెచ్చే క్రమంలో మేం ముందు వరుసలో ఉన్నాం. మా రాష్ట్రాన్ని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పునరుత్పాదక ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30% ఆంధ్రప్రదేశ్ లోనే సాధించాలన్నది మా ధ్యేయం. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు. విద్యుత్ భద్రత, ఆర్థిక పోటీ, పర్యావరణ సంరక్షణకు మేం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం. మా లక్ష్యసాధనకు మీ వంతు సహకారం అందించాలని కోరారు.
జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ కీలకం
ఈరోజు ప్రపంచం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలకం. అక్టోబర్ 2023 నుండి సెప్టెంబర్ 2024 వరకు, భారతదేశంలో 369 మిలియన్లకి పైగా సైబర్ సెక్యూరిటీ ఘటనలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2033 నాటికి సైబర్‌దాడులు సుమారు 1 ట్రిలియన్ డాలర్ల నష్టాలను కలిగించనుందని అంచనా. ఇవి చాలా ఆందోళనకరమైన అంశం. ఇవి కీలకమైన మౌలిక సదుపాయాలకు అడ్డంకులు సృష్టించి, ఆర్థిక అభివృద్ధి ప్రతిబంధకంగా మారతాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. మా రాష్ట్రంలో పరిశ్రమలు, రవాణా, విద్యుత్ రంగాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే బలమైన సైబర్ సెక్యూరిటీ అవసరం. ఇదే సమయంలో, మాకు ఒక అనుకూల అంశం కూడా ఉంది. మా విద్యార్థుల 70% STEM కార్యక్రమాల్లో చేరారు. ఇది స్వదేశీ సైబర్‌సెక్యూరిటీ నిపుణులను తయారు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 లక్షల ప్రొఫెషనల్ సైబర్ నిపుణుల లోటును తీర్చే అవకాశం మాకు ఉంది. చమురు- సహజ వాయువు, విద్యుత్, సప్లయ్ చెయిన్ వంటి కీలక రంగాల్లో సైబర్ సెక్యూరిటీ మూల్యాంకన నమూనాలను అమలు చేయడంలో సహకారాన్ని అందించండి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక అభివృద్ధి చేసిన ‘‘స్ట్రాటజిక్ సైబర్‌సెక్యూరిటీ టాలెంట్ ఫ్రేమ్‌వర్క్’’ ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సైబర్‌సెక్యూరిటీ టాలెంట్ పూల్‌ను ప్రోత్సహించాలని మంత్రి లోకేష్ కోరారు.
సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవిల్యూషన్ (C4IR) లో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. C4IR ఆంధ్రప్రదేశ్ విజయానికి సహకారమే ప్రాణం. ఆర్థికంగా మాత్రమే కాక మేధోపరంగా, కార్యపరంగా కూడా ఈ ప్రయాణంలో సంస్థాపక భాగస్వాములుగా మాతో చేరండి. హరిత, సురక్షిత, సుసంపన్నమైన భవిష్యత్తు రూపకల్పనలో భాగస్వాములు కండి. ఆంధ్రప్రదేశ్ ధైర్యంగా, ధృఢంగా ముందుకు సాగుతోంది. మేము ఒక బలమైన ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తున్నాం. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రపంచ నిపుణులతో అనుసంధానించి సరికొత్త ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుందని లోకేష్ తెలిపారు.
ఈ సందర్భంగా జెరేమి జుర్గెన్స్ మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ‘‘మొబిలైజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ క్లిన్ ఎనర్జీ ఇన్ ఇమర్జింగ్ ఎకానమీస్ (MICEE)’’ కార్యక్రమం ద్వారా పెట్టుబడులను ఆవిష్కరించి, ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేయడంలో తమ సెంటర్ తోడ్పాటు అందిస్తుందన్నారు. అలాగే ‘‘ఎనర్జీ లెర్నింగ్ ప్రోగ్రాం’’, C4IR మలేషియా వంటి విజయవంతమైన నమూనాల స్ఫూర్తితో, ప్రజల్లో అవగాహన పెంపొందించడాన్ని, యువతలో ఇంధన సాంకేతికతలపై నైపుణ్యాన్ని పెంపొందించడాన్ని లక్ష్యంగా ఉంచుతుంది. సైబర్ సెక్యూరిటీపై మా సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని జెరేమి జుర్గెన్స్ చెప్పారు.













