- ఏఐ ద్వారా విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గించే చర్యలు
- ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు
- ప్రజలకు లబ్ధి కలిగేలా విద్యుత్ వ్యవస్థలను తీర్చిదిద్దుతాం
- సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్-CECRC ఏర్పాటుపై ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- ఇంధన భద్రత, టెక్నాలజీ వినియోగం కోసం CECRC
- సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనమిక్ ఫొరంతో రాష్ట్రం కీలక ఒప్పందం
- తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం: మంత్రి లోకేష్
విశాఖపట్టణం (చైతన్యరథం): ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడిరచారు. ఇదే సమయంలో టెక్నాలజీని వినియోగించి… ప్రజలకు లబ్ధి కలిగేలా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు ఉండాలని అభిప్రాయపడ్డారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఇంధన భద్రత, విద్యుత్ రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం కోసం వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF)తో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ సెంటర్ CECRC ఏర్పాటుపై WEFతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు WEF ముందుకు రావడం సంతోషం. ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తోంది. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అతితక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు చేసి వినియోగాన్ని పెంచగలిగాం. ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలి. అప్పుడే ఇంధన రంగంలో సుస్థిరత సాధ్యం అవుతుంది. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ ఇలా ప్రతి రంగానికీ విద్యుత్ అవసరమే. ఈ మేరకు విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు… మరింత విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలకు లబ్ధి కలిగించేలా…మరింత మేలు జరిగేలా…ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నాం. ట్రాన్స్‌మిషన్ నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాం. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా వ్యవస్థలు ఉండాలి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఏపీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు.
డేటా సెంటర్లకు విద్యుత్ తక్కువ ఖర్చులో ఇవ్వగలగాలి: నారా లోకేష్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోంది. 6 గిగావాట్ల సామర్ధ్యంతో విశాఖకు డేటా సెంటర్ తీసుకురావాలని ఆలోచన చేశాం. ఇప్పుడది సాకారం అయ్యింది. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయటం ఓ సవాలు. అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశం. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయి. అందుకే ఆధునిక టెక్నాలజీలపై ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు వాటిని నిజం చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుంది. సీఎం ఆలోచన చేస్తే దానిని తక్షణం అమలు చేయాలని ఆదేశిస్తారు. అందుకే మంత్రులుగా మేమూ… అధికారులు అంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నానని మంత్రి లోకేష్ చెప్పారు.
గ్రీన్ ఎనర్జీలో ఏపీకి భారీగా పెట్టుబడులు : మంత్రి గొట్టిపాటి
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… టెక్నాలజీ కోసం మాత్రమే కాకుండా… ఇంధన వ్యవస్థల రక్షణ కోసం CECRC ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఈ సమయంలో విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యమని మంత్రి గొట్టిపాటి అభిప్రాయపడ్డారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ జేరేమీ జర్గన్స్ మాట్లాడుతూ… ఏఐ ట్రాన్సిషన్ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పారు. ఏపీలో ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అభినందనీయమని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, ఇంధన భద్రత విషయంలో భారత్‌లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయని… ఇలాంటి సమయంలో వ్యవస్థల రక్షణ అత్యంత కీలకమైన అంశమని వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఈ తరహా కేంద్రాలు అవసరమవుతాయని జేరేమీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.













