- సీఐఐ సదస్సు రెండో రోజూ వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ
- క్రూయిజ్ టూరిజం, బొబ్బిలి కోటల అభివృద్ధిపైనా చర్చ
విశాఖపట్నం (చైతన్యరథం): సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు శనివారం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా భేటీ అయ్యారు. ముందుగా ఎల్జీ కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యున్జోకోతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కాకినాడ లేదంటే మూలపేటల్లో ఎల్జీ కెమ్ నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్, పాలిమర్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని సీఎం ఈ సందర్భంగా ప్రతిపాదించారు. జేఎస్‌డబ్ల్యుతో కలిసి ఎల్జీ కెమ్ ఏర్పాటు చేయదలిచిన కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్‌కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీలో భాగంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుందని సీఎం సూచించారు. డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్… ఇలా అన్ని రంగాల్లో ఏపీ ముందుకెళ్తోందని వివరించిన సీఎం… అబుదాబి తరహాలో రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగస్వామి కావాలని యున్జోకోను కోరారు.
అట్మాస్పియర్ కోర్
ప్రముఖ గ్లోబల్ హాస్పిటాలిటీ గ్రూప్ అట్మాస్పియర్ కోర్ దక్షిణాసియా ఎండీ సౌవగ్య మొహాపాత్ర, గ్రూప్ ఎండీ సలీల్ పాణిగ్రాహితోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆధునిక పర్యాటక రంగ అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటల్ పోర్ట్‌ఫోలియో విస్తరణ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో అట్మాస్పియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అట్మాస్పియర్ కోర్ సంస్థ ప్రతినిధులు వెల్లడిరచారు. గండికోటలో అడ్వంచర్ రిసార్ట్స్, అరకు-అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటుకు యోచించాలని, అదేవిధంగా బొబ్బిలి-విజయనగరం కోటలను పరిశీలించి వాటిని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయవచ్చనే దానిపై అభిప్రాయం చెప్పాలని సీఎం కోరారు. విశాఖలోని రుషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మించేందుకు అట్మాస్పియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్యం చేశారు.
ఇఫ్కో చైర్మన్‌తో భేటీ
ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై చర్చించారు. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు మేలు చేకూరే విధంగా ఇఫ్కోతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.
కోర్డెలియా క్రూయిజెస్
పర్యాటక రంగంలో ప్రముఖ సంస్థ కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈవో జుర్గెన్ బైలామ్‌ను సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది.













