- ఒప్పందాలన్నీ మూడేళ్లలో అన్నీ కార్యరూపం
- హాజరైన 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 4,975 మందికి పైగా పారిశ్రామికవేత్తలు
- ఎనిమిది దేశాలతో 16, 91 మంది ప్రముఖులతో 41 వ్యాపార సమావేశాలు
- రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు
- అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం
- మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్యరథం): రెండు రోజుల విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సదస్సులో 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు సహా 4,975 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 91 మంది పారిశ్రామిక వేత్తలతో 41 వ్యాపార సమావేశాలు నిర్వహించామని, ఎనిమిది దేశాలతో 16 వ్యాపార సమావేశాలు నిర్వహించామని, 24 ద్వైపాక్షిక సమావేశాలలో తాను పాల్గొన్నానని ఆయన తెలిపారు. ఈ సదస్సు రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, 613 అవగాహన ఒప్పందాలు కుదరగా 16.31 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని, 17 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన తెలిపారు.
వేగం కీలకం
సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ సదస్సు పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాలేదని, నాలెడ్జ్ షేరింగ్ సెషన్లు, ప్రపంచ పారిశ్రామిక రంగంపై చర్చలతో హైబ్రిడ్ నమూనాలో నిర్వహించమన్నారు. అదనంగా 450 మంది విద్యార్థులను ఈ సదస్సులో పాల్గొనడానికి ఎంపిక చేసి, వారికి భావి ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగేందుకు అవకాశం కల్పించామన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలనే ఆశయంతో ఉన్న యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదికగా పనిచేస్తోందన్నారు. భావి ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదనంగా పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి ఉమ్మడి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శ్రీసిటీని గురించి చెబుతూ అక్కడ 31 దేశాల భాగస్వామ్యంతో 240 యూనిట్లు ఉన్నాయని, దేశాల భాగస్వామ్యం యాభైకి పెంచాలని ముఖ్యమంత్రి అన్నారు. మంత్రులు, అధికారుల చొరవతో అన్ని విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని కలిగించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో భారీ పెట్టుబడులను ఆకర్షించిందన్నారు.
20 లక్షల ఉద్యోగాల లక్ష్యం అధిగమిస్తాం
అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాలతో పాటు, ఎస్క్రో ఖాతాలను తెరిచి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి సావరిన్ గ్యారెంటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చెప్పారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్న సూపర్ సిక్స్ హామీ లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. 24 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిలో భాగంగా తూర్పు నుండి పశ్చిమానికి లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని ఆయన అన్నారు. రాయలసీమను ఉద్యానవన, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, కోస్తాంధ్రను ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేస్తామని, డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం ప్రాంతాన్ని ఏఐ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.
మూడేళ్లలో కార్యరూపం
కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ వాస్తవ పెట్టుబడులేనన్నారు. ఈ పెట్టుబడులన్నీ మూడేళ్లలో కార్యరూపం దాల్చుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యే వరకు మంత్రుల బృందం పెట్టుబడి ప్రతిపాదనలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఫాలో అప్ చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించామన్నారు.













