- ఏపీ అభివృద్ధికి పోటెత్తిన ‘భాగస్వామ్యం’
- వరదలా వచ్చిపడిన పారిశ్రామిక పెట్టుబడులు
- విశాఖ వేదికగా భారీగా కుదిరిన ఎంఓయూలు
- జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు
- పారిశ్రామికవేత్తల స్పందనతో ఏపీలో ఉత్సాహం
- 400 ఎంఓయూల ద్వారా రూ.11.92 లక్షల కోట్లు
- 13.32 లక్షలమందికి ఉద్యోగావకాశాలు..
- తొలి రోజు ‘భాగస్వామ్యం’ రూ.8.26 లక్షల కోట్లు
- ఒక్కరోజులో రాష్ట్రానికి 12.05 లక్షల ఉద్యోగావకాశాలు
- తొలిరోజు సీఎం సమక్షంలో 41 ఎంఓయూలు
- ఒప్పంద పెట్టుబడులు.. రూ.3.5 లక్షల కోట్లు
- 4.16 లక్షల ఉద్యోగావకాశాలు..
- మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు
- ఒప్పంద పెట్టుబడులు.. రూ.4.76 లక్షల కోట్లు
- సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖలకు భారీ స్పందన
విశాఖపట్నం (చైతన్య రథం): దేశానికి గేట్ వేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పీల్ `ప్రపంచ పారిశ్రామికవేత్తలపై పాశుపతాస్త్రంలా పనిచేసింది. చంద్రబాబు సమర్థత, సంకల్పబలంపై అచంచల విశ్వాసమున్న పారిశ్రామిక దిగ్గజాలు.. సాంకేతిక టైకూన్‌లు `విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు బారులు తీరారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏపీ డోర్స్ ఆర్ ఓపెన్ అంటూ `బ్రాండ్ సీబీఎన్ ఇచ్చిన ఇన్విటేషన్‌కు ఆరంభంలోనే దక్కిన ప్రతిఫలం `అక్షరాలా రూ.11 లక్షల 91వేల 972 కోట్లు! ఈ పెట్టుబడులవల్ల రాష్ట్రవాసులకు దక్కే ఉద్యోగావకాశాలు 13 లక్షల 32 వేల 445. భాగస్వామ్య సదస్సు ఆరంభానికి 24 గంటలుముందే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు `రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలోవున్న అవకాశాలు.. ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఇవ్వబోయే ప్రోత్సాహకాలు.. నెలకొల్పిన సంస్థల లాభదాయక మనుగడకు తీసుకొచ్చిన పాలసీలు.. `ఇలా ప్రతి విషయంలోనూ సమర్థవంతమైన ప్రజెంటేషన్ ఇస్తూ వచ్చారు. విశ్రాంతి అన్నదే మర్చిపోయి.. క్షణం తీరిక లేకుండా చంద్రబాబు సాగించిన పెట్టుబడుల వేట.. అందుకు దక్కిన ప్రతిఫలం చూసి రాష్ట్రమే విస్మయానికి గురవుతుంది. సీబీఎన్ టీం లక్ష్యంగా పెట్టుకున్న రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన సాధ్యమేనా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఒక్కరోజులోనే లక్ష్యాన్ని అధిగమించిన చంద్రబాబు సమర్థత, ముందుచూపునకు `కేంద్రం పెద్దలు, రాష్ట్ర ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
రెండురోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు శుక్రవారంనాటికి `రాష్ట్ర ప్రభుత్వం 400 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈమేరకు జరిగిన ఒప్పందాల ద్వారా రూ.11,91,972 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 13,32,445 ఉద్యోగాలపై హామీ పొందింది. ఇదీ `గురు, శుక్రవారాల్లో వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల విలువ. మొత్తంగా 7 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు`వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో విశాఖ సమ్మిట్ మొదటి రోజునే సూపర్ హిట్ అనిపించుకుంది. ప్రభుత్వ అంచనాలకుమించి పరిశ్రమలు ప్రతిస్పందించాయి. మొత్తంగా 410 ఎంఓయూల ద్వారా రూ.10 లక్షల కోట్లవరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే అంచనాలకుమించి పారిశ్రామికవేత్తలనుంచి స్పందన కనిపించింది. భాగస్వామ్య సదస్సుకు ముందురోజే భారీఎత్తున పెట్టుబడులురాగా.. సదస్సు తొలిరోజున అంతకుమించిన స్పందన కన్పించింది. సదస్సు తొలిరోజైన శుక్రవారం 365 ఎంఓయూలు కుదుర్చుకోగా… వీటిద్వారా రూ.8,26,668 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 12,05,175 మందికి ఉద్యోగావకాశాలు వివిధ పరిశ్రమల నుంచి దక్కనున్నాయి. ఇదంతా ఒక్క రోజులో సాధ్యమైన సంచలనం!!
ముఖ్యమంత్రి సమక్షంలో…
భాగస్వామ్య సదస్సు సందర్భంగా గత రెండు రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.7,15,490 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 5,42,761మంది ఉద్యోగాలకు హామీ పొందింది రాష్ట్ర ప్రభుత్వం. భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు. గురువారం వరుసగా 15 భేటీలు నిర్వహిస్తే.. శక్రవారం దాదాపు అదేస్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సీఎం సమక్షంలో ఎంఓయూలు చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడిరగ్, ఎస్‌ఏఈఎల్, జెఎం బాక్సీ, శ్రీ సిమెంట్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, టాటా పవర్, పతంజలి ఫుడ్, ఇండస్ కాఫీ, కెల్లాగ్ ఇండియా తదితర సంస్థలున్నాయి. ఇక విడివిడి భేటీల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబుడులను ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులకు ఆసాంతం వివరిస్తూ… పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యలనూ వివరించారు. వీటితోపాటు.. కేంద్ర ప్రభుత్వం వైపునుంచి రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటే.. అవీ వచ్చేలా సహకరిస్తామని కంపెనీల ప్రతినిధులకు హామీలిచ్చారు. భాగస్వామ్య సదస్సు తొలిరోజు జరిగిన ఒప్పందాల కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధనరెడ్డి, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల సమక్షంలోనూ భారీగా ఒప్పందాలు…
ఇక వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలిరోజున భారీఎత్తున ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులను రాబట్టారు. ఐటీ మంత్రి లోకేష్, వివిధ శాఖల మంత్రులంతా కలిసి మొత్తంగా 324 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రూ.4,76,482 కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు. ఈ ఒప్పందాల ద్వారా 7,88,884 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. తొలిరోజు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రుల్లో నారా లోకేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ ఉన్నారు. నారా లోకేష్ రూ.1,38,752 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా… మిగిలిన మంత్రులు కూడా భారీఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
రెండు రోజుల్లో రంగాలవారీ సాధించిన పెట్టుబడుల వివరాలు:
విద్యుత్ రంగం రూ.5,11,502 కోట్లు 2,45,222 మందికి ఉద్యోగావకాశాలు
ఐ అండ్ ఐ రూ.2,05,008 కోట్లు 3,05,574 మందికి ఉద్యోగావకాశాలు
సీఆర్డీఏ రూ.50,511 కోట్లు 42,225 మందికి ఉద్యోగావకాశాలు
మున్సిపల్ రూ.4,944 కోట్లు 12,150 మందికి ఉద్యోగావకాశాలు
ఫుడ్ ప్రాసెసింగ్ రూ.13,009 కోట్లు 47,390 మందికి ఉద్యోగావకాశాలు
పరిశ్రమలు..వాణిజ్యం రూ.2,68,248 కోట్లు 4,23,869 మందికి ఉద్యోగావకాశాలు
ఐటీ రూ.1,38,752 కోట్లు 2,56,015 మందికి ఉద్యోగావకాశాలు















