విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కేయిచ్చి తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఓనో కేయిచ్చి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. జపాన్ ఫార్మా రాజధాని కొయామా మాదిరిగానే ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జపాన్ పనితీరు తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమిట్‌లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణాల్లో జపాన్, సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎ చంద్రబాబు కేయిచ్చితో తెలిపారు.














