- రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ సెంటర్
- లులూ గ్రూప్ ఇంటర్నేషనల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ
- ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం
విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత పాలకులు నిలిపేసిన ప్రాజెక్టును ఎట్టకేలకు రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చామన్నారు. గూగుల్, ఆర్సెల్లార్‌వంటి సంస్థలు విశాఖ రావడం లులూ సంస్థకు సానుకూల అంశమని సీఎం ప్రస్తావించారు. మూడేళ్లలోగా మాల్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లులూ మాల్ కేవలం షాపింగ్‌మాల్ మాత్రమే కాదని, విశాఖ పర్యాటకానికి దోహదపడుతుందని అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా మాల్స్ నిర్వహిస్తున్న లులూ సంస్థ ఇందుకు అవసరమ్యే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా లులూ చైర్మన్‌ను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ లులూ సంస్థ ఒప్పందాలు చేసింది. మామిడి, జామ పల్ప్‌తోపాటు మసాలా దినుసులు రాష్ట్రంనుంచి సేకరించి ఎగుమతి చేస్తామని లులూ సంస్థ వెల్లడిరచింది. వచ్చే జనవరి నుంచి ఏపీనుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్టు లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖ నగరంలో లులూ సంస్థ 13.83 ఎకరాలు, 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,066 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌తో 5 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రస్తుతం విశాఖలో నిర్మించనున్న మాల్ భారత్‌లో 9వదని రాష్ట్రంలో మొట్టమొదటిదని లులూ సంస్థ వెల్లడిరచింది.














