- భారీ పెట్టుబడులకు ముందుకు రావడం అభినందనీయం
- ఎక్స్ పోస్టులో సీఎం చంద్రబాబు నాయుడు
- రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు
విశాఖపట్నం (చైతన్య రథం): రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమ్ బోర్డు సభ్యుడు ఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సౌత్ మెంటార్ మాధవరావులతో భేటీ ఆనందాన్నిచ్చింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ అంగీకారం తెలపడాన్ని రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రిలయన్స్ రాష్ట్రంలో 1 జిడబ్ల్యు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన జీపీయులు, టీపీయులు, ఏఐ ప్రాసెసర్‌లను హోస్ట్ చేయడానికి రూపొందించబడిన పూర్తి మాడ్యులర్. ఇది జామ్‌నగర్‌లోని రిలయన్స్ గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా పనిచేయనుంది. జామ్‌నగర్, ఏపీలోని రెండు ఏఐ డేటా సెంటర్లతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ మౌలిక సదుపాయాల నెట్వర్క్‌లో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ ఒకటిగా రూపుదిద్దుకోనుంది. ఏపీ డేటా సెంటర్‌ను మరింత శక్తివంతం చేసేందుకు వీలుగా 6 జీడబ్ల్యుపీ సౌర విద్యుత్ ప్రాజెక్టునూ రిలయన్స్ నెలకొల్పనుంది. ఈ చొరవ ఏపీ ప్రస్తుత గ్రౌండ్-మౌంటెడ్ సోలార్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. మన పునరుత్పాదక శక్తిలో 30శాతంకంటే ఎక్కువకు దోహదపడుతుంది, ఏపీయొక్క విస్తారమైన సౌర సామర్థ్యాన్ని బలోపేతం చేయనుంది. అదనంగా రాయలసీమలో ప్రపంచస్థాయి ఆటోమేటెడ్ సౌకర్యమైన గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్‌పార్క్‌ను నిర్మించనుంది. ఈ భారీ పెట్టుబడి ప్రత్యక్షంగా పరోక్షంగా వేల ఉద్యోగాలను సృష్టించనుంది. వేలాది కుటుంబాలకు స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ, స్వచ్ఛమైన ఇంధన నాయకత్వం, సమ్మిళిత వృద్ధి ప్రయాణంలో కొత్త మైలురాయిని సూచించే రిలయన్స్ ప్రకటనలు సంతోషదాయకం. అందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.














