- డిగ్రీలతోపాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలి
- స్కిల్ అంతరాలను భర్తీచేసేందుకే ఏపీలో నైపుణ్య గణన
- ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
- కూటమి ప్రభుత్వం వచ్చాక 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- విశాఖ పెట్టుబడుల సదస్సులో మరో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- సీఐఐ ` విట్ ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): భారతదేశం త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది, దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ విజన్, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ సదరన్ రీజియన్ ` విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో బుధవారం నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ ` 2025కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునః రూపకల్పన చేయడం.. అనే థీమ్ తో ఈ కాంక్లేవ్ ఏర్పాటుచేశారని, ఈ అంశంపై తాను ఏకీభవించడం లేదన్నారు. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుంది.. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న లక్ష్యం.. మానవవనరులు, మేధోసంపద లేకుండా ఆర్థికవృద్ధి సాధ్యం కాదు.. ఈ మహోన్నత లక్ష్యఛేదనకు ఉన్నతవిద్యా రంగం వ్యూహాత్మక మూలస్తంభంగా మంత్రి లోకేష్ అన్నారు.
ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యం
గత 17నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. త్వరలో జరగబోయే పెట్టుబడుల సదస్సులో మరో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. 2029 నాటికి ట్రిలియన్ డాలర్ పెట్టుబడులు మా లక్ష్యం, రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలోపేతమవుతుంది. రాష్ట్రాలు పోటీ పడితే భారతదేశం గెలుస్తుంది. పెట్టుబడుల ఆకర్షణకు వేగం ముఖ్యం. మనం మార్పులను అందరికంటే ముందుగా స్వీకరించాలి. అమరావతిలో రాబోయే మూడేళ్లలో మీరంతా అద్భుతాలను చూడబోతున్నారు. యువత కలల సాకారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. కరిక్యులమ్ మార్పులు అంత ఈజీకాదు, అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యారంగంలో మార్పు అనివార్యం. ఆ దిశగా ఉన్నత విద్యారంగంలో సంస్కరణల అమలుకు ఉన్నత విద్యారంగ నిపుణులు కృషిచేయాలని మంత్రి లోకేష్ సూచించారు.
డెమొగ్రఫిక్ డివిడెండ్ మన సొంతం
భారత జనాభాలో 54 శాతం మంది 25 సంవత్సరాలలోపు వయస్కులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలీయమైన యువశక్తి మనకు మాత్రమే సొంతం, ఇది మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్. అయితే యువతను భవిష్యత్తుకు అవసరమైన విద్య, ఉద్యోగ యోగ్యమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినపుడే వారు మనకు వాస్తవిక డివిడెండ్ అవుతారు. భారతదేశపు పని యోగ్య జనాభాలో కేవలం 34.7 శాతం మందికి మాత్రమే అధికారిక నైపుణ్య శిక్షణ ఉంది. దక్షిణ కొరియాలో 96%, జపాన్‌లో 80%, జర్మనీ 75% తో పోలిస్తే భారత్ లో చాలా తక్కువ. మన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో కేవలం 28.4 శాతం మాత్రమే ఉందని మంత్రి లోకేష్ తెలిపారు.
నైపుణ్యాలపై దృష్టి సారించాలి
ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం మన గ్రాడ్యుయేట్లలో కేవలం 51 శాతం మాత్రమే ఉద్యోగయోగ్యులు. ఇది మేధస్సు లోపం కాదు. మనం బోధించే అంశాలు, మార్కెట్ అవసరాల మధ్య అసమతుల్యత దీనికి ప్రధాన కారణం. మన ఉన్నత విద్యాసంస్థల్లో 3-4 సంవత్సరాల కోర్సులు పూర్తిచేసినా ఉద్యోగావకాశాలు రావడంలేదు. కానీ అమీర్ పేటలో కోచింగ్ సెంటర్లు కేవలం 3-4 నెలల శిక్షణతోనే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ అంతరాన్ని భర్తీచేసేందుకు ఉన్నత విద్యారంగంలో ప్రాథమికంగా మార్పురావాలి. యువత డిగ్రీ పొందడంతోపాటు క్రియాశీల నైపుణ్యాలపై దృష్టిసారించాలి. ప్రస్తుతం మనముందున్న ప్రధాన సవాలు నైపుణ్యలేమి. విద్యారంగం, పరిశ్రమల మధ్య స్థిరమైన అంతరం ఉన్నదనేది కఠోర సత్యం. ఈ సమస్యను అధిగమించేందుకు వేగవంతంగా సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. పరిశ్రమల్లో సాంకేతికతలపై ఫ్యాకల్టీ అధ్యయనం, టెక్నాలజీకి అనుగుణంగా డైనమిక్ కరిక్యులమ్, అభ్యాస అనుభవాన్ని ఇచ్చే స్ట్రక్చర్డ్ ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థులకు మెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం వంటివాటిపై దృష్టిసారించాల్సి ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
స్కిల్ గ్యాప్ భర్తీకే స్కిల్ సెన్సస్
ఆంధ్రప్రదేశ్ లో 16నెలల క్రితం కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ సెన్సస్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ప్రొఫైల్‌లోని నైపుణ్యాన్ని అంచనా వేసి, లోటుపాట్లను గుర్తిస్తాం. ఈ కార్యక్రమాన్ని నా సొంత నియోజకవర్గం మంగళగిరి నుంచే ప్రారంభించాం. యువతకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ అందించి పరిశ్రమ అవసరాల మేరకు వర్క్ ఫోర్స్‌ను తయారు చేయడమే స్కిల్ సెన్సస్ లక్ష్యం. దీంతోపాటు ‘నైపుణ్యం పోర్టల్’ పేరిట కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫారాన్ని తయారుచేశాం. త్వరలో ఈ పోర్టల్ ను ప్రారంభించబోతున్నాం. ఇది స్కిల్స్, ఉపాధి మధ్య అంతరాన్ని తొలగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిరది. మన యువత సానుకూల దృక్పథం, క్రమశిక్షణలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. ఐటీ రంగంలో ఈరోజు తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఐటి కంపెనీల్లో కీలకస్థానాల్లో ఉన్నారని మంత్రి లోకేష్ గుర్తచేశారు.
2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మా లక్ష్యం
ఉన్నత విద్యారంగంలో మార్పును తెచ్చే ఐఐటీ – తిరుపతి, ఐఐఎం – విశాఖపట్నం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలు , విట్`ఏపీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏపీలో ఉండటం మాకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్ జాబ్స్, స్టార్టప్స్‌కు సిద్ధంగా ఉంది. డేటా సెంటర్లు, క్వాంటమ్, ఇన్నోవేషన్స్ లో ఏపీ ముందు వరుసలో ఉంది. ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మేం విజన్ -2047 డాక్యుమెంట్ ‘‘స్వర్ణ ఆంధ్ర’’ తో ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు.
మార్పునకు 5 అంశాలు కీలకం
ఈ ప్రయాణంలో విద్యే మూలస్తంభం కాగా, ఐదు రంగాలు పరివర్తన అనుబంధ స్తంభాలు. ఏపీ ఉన్నత విద్యారంగాన్ని నాలెడ్జి అండ్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చడానికి ఇవి దోహదపడతాయి. 1.కరిక్యులమ్ టు కెరీర్: పుస్తకాల్లోని పాఠాలే కాకుండా నైపుణ్యం, సమస్య – పరిష్కారాలతో కూడిన విద్యాబోధన. ఇందుకోసం పరిశ్రమతో కలిసి సిలబస్ రూపొందించి, ఉద్యోగాలకు సరిపడా సమతుల్యత సాధించాలి. 2. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్: ప్రతి యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేషన్ హబ్‌లు, పేటెంట్ సెల్‌లు, స్టార్ట్‌అప్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కనీసం 25 శాతం విశ్వవిద్యాలయ సంస్కరణలు కార్యరూపంలోకి రావాలి. 3. డిజిటల్ భవిష్యత్ నైపుణ్యాలు: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, గ్రీన్ టెక్నాలజీ అండ్ రోబోటిక్స్ కోర్సులు విస్తరించాలి. ప్రతి గ్రాడ్యుయేట్ డిజిటల్ నైపుణ్యం కలిగి, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు సాధించగలిగేలా చూడాలి. 4. అంతర్జాతీయీకరణ: ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో పరస్పర డిగ్రీలు, పరిశోధన భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో విద్యను సాఫ్ట్ పవర్ ఎగుమతిగా అభివృద్ధి చేయాలి. 5. ప్రాంతీయ సమతుల్యత, వ్యాప్తి: వేగవంతమైన పారిశ్రామికీకరణకు క్లస్టర్ బేస్డ్ విధానాన్ని రూపొందించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ అశ్విన్ మహాలింగం, విట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం, ఫస్ట్ జెన్ ఫౌండర్ అండ్ సీఈవో ఫిలిప్ ఆస్మస్, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కె.రత్నషీలామణి, సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ శరణం నరేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.















