- రెన్యూ పవర్ ఛైర్మన్ సుమంత్ సిన్హాతో సీఎం చంద్రబాబు భేటీ
- రూ.82,000 కోట్లతో రాష్ట్రంలో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులు
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో కుదిరిన ఒప్పందాలు
విశాఖపట్నం (చైతన్య రథం): గత ప్రభుత్వంలో రాష్ట్రంనుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థ రెన్యూ పవర్ రాష్ట్రంలో రూ.82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంథన రంగంలో ఏపీ ముందంజలో ఉందని, పర్యావరణ పరిరక్షణతో పాటు… వినియోగదారులకు విద్యుత్‌ను తక్కువ ధరకు అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోందని, వేగవంతమైన అనుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా సుమంత్ సిన్హా కొనియాడారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తున్న నేపథ్యంలో భారీగా తలెత్తే విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుమంత్ వెల్లడిరచారు.
ముందే ప్రకటించిన మంత్రి లోకేష్
మంత్రి లోకేష్ బుధవారం ఎక్స్‌లో ప్రకటించినట్లుగానే ఇంథన రంగంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన రెన్యూ పవర్ సంస్థ తిరిగి కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూలు కుదుర్చుకుంది. గతంలోనే రూ. 22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన రెన్యూ పవర్… మొత్తంగా రూ.82,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పందంలో భాగంగా 6 గిగావాట్ల ఇంగాట్-వేఫర్ ప్లాంట్, 2 గిగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 కేటీపీఏ గ్రీన్ అమ్మోనియా సామర్ధ్యం, 5 గిగావాట్ల విండ్-సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రంలోని యువతకు దక్కనున్నాయి. రెన్యూ పవర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకటైన 2.8 గిగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 1.8 గిగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్ ఉంది. అలాగే 2 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది.
రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన
మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు స్వయంగా సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుంది…, ఎకరానికి ఎంత ఆదాయం వస్తుందనే దానిపైనా రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చర్చించారు. అలాగే సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.















