విశాఖపట్నం నగరంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తిరిగి నూతన పెట్టుబడుల శకానికి ఏపీ శ్రీకారం చుడుతోంది. దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనబోతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి తిరిగి గ్లోబల్ దృష్టి లభిస్తోంది.
సీఐఐ సదస్సు -ఏపీ పునరుజ్జీవానికి నాంది
‘‘పెట్టుబడులే అభివృద్ధి మార్గం `అభివృద్ధే ప్రజల భవిష్యత్తు’’ అనే దృఢ సంకల్పంతో చంద్రబాబు, లోకేష్ చొరవ తీసుకొని నిర్వహిస్తున్న సదస్సు చరిత్రలో నిలవనుంది. పారదర్శక పాలన ద్వారా రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చే లక్ష్యం అమలవుతోంది. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడుల శకానికి శ్రీకారం చుట్టనుంది. ఏపీ పునరుజ్జీవనానికి నాంది పలుకుతుంది. వేల ఉద్యోగాలకు, నూతన పరిశ్రమలకు, టెక్ దిగ్గజాలకు వేదికగా నిలుస్తుంది. ఈ సమ్మిట్‌లో సుమారు రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు కుదరబోతున్నాయి. దీని ద్వారా రాష్ట్ర యువతకు 7.5 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముంది. 20 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి వచ్చిన సంకేతంగా భావించవచ్చు. రాష్ట్రాన్ని డిజిటల్ ఇండియాలో గ్లోబల్ లీడర్‌గా మార్చే పునాదిగా సదస్సు నిలవనుంది. విశాఖ సీఐఐ సమ్మిట్ రాష్ట్రాభివృద్ధిని కొత్త అధ్యాయానికి తీసుకెళ్తోంది.
పెట్టుబడుల పునరాగమనం
2024లో ప్రభుత్వం మారిన తర్వాత కేవలం 17 నెలల్లోనే రూ.9.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, గ్రీన్ ఎనర్జీ, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్… ఇలా అనేక రంగాల్లో అనూహ్య పెట్టుబడులు రాష్ట్రానికి ప్రవహించాయి. ప్రభుత్వ సింగిల్ విండో క్లియరెన్స్, పారదర్శక విధానాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వంటి చర్యల ద్వారా పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 23 పాలసీలను ప్రకటించింది. పారదర్శక పారిశ్రామిక విధానం ద్వారా వేగంగా అనుమతులిస్తుంది. అవసరమైన భూసమీకరణ, మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్, యూత్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. గ్రీన్ ఎనర్జీకు ప్రోత్సాహం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడుతుంది. పారిశ్రామిక పార్కులు, కాంపొనెంట్ ఆటోక్లస్టర్స్ ఏర్పాటు కానున్నాయి. దాంతో గూగుల్, టీసీఎస్, ఆర్సెలార్ మిట్టల్, ప్రీమియర్ ఎనర్జీస్, సిర్మా ఎస్‌జిఎస్‌వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీనే ఎంచుకున్నాయి.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నారా లోకేష్ మార్క్
యువతకి 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మంత్రి లోకేష్ అమెరికా, సింగపూర్, దావోస్, ఆస్ట్రేలియావంటి దేశాల్లోని పెట్టుబడిదారులను ప్రత్యక్షంగా కలిశారు. విదేశీ పెట్టుబడులకు అవసరమైన భూమి, పవర్, మౌలిక సదుపాయాలు, స్కిల్ మిషన్ ద్వారా కంపెనీల టార్గెట్‌ను దృష్టిలో ఉంచుకుని అనేక విభాగాల్లో ఒప్పందాలు తెచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరించారు. గత ప్రభుత్వం విధానాల వలన పెట్టుబడిదారులకు రాష్ట్రంపై పోయిన నమ్మకాన్ని తిరిగి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్పించడంలో యువనేత నారా లోకేష్ సఫలీకృతమయ్యారు. ఒక్క జూమ్‌కాల్‌తో రాష్ట్రానికి అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్‌ను తీసుకొచ్చారు. కాలిఫోర్నియాలో గూగుల్ ప్రతినిధులతో జరిగిన ఒక్క భేటీతో విశాఖకు అతిపెద్ద ఎఫ్‌డీఐని తెచ్చారు. ముంబైలో రిలయన్స్ ప్రతినిధులతో జరిగిన చర్చకు ఫలితంగా అతిపెద్ద బయో గ్యాస్ ప్లాంట్‌లను ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు. ఈవిధంగా అనేక దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడుల వరదను పారించారు మంత్రి నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యం, రాష్ట్రాభివృద్ధే తన ధ్యేయంగా పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిలవనుంది.
గూగుల్ ‘ది ఏఐ సిటి’
మంత్రి నారా లోకేష్ కృషికి గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్లు (రూ.1.33 లక్షల కోట్లు) భారీ పెట్టుబడి ప్రకటించడం, రాష్ట్రానికి అద్భుత గౌరవాన్ని తీసుకొచ్చింది. దీని ఫలితంగా ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్, ఏఐ హబ్‌గా మారుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో టెక్నాలజీ రంగంలోనే ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఈ ప్రాజెక్టు వలన 1.80 లక్షలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందనున్నాయి. విశాఖ ఏఐ, ఐటీ, డిజిటల్ సర్వీసుల మెట్రోగా అవతరిస్తుంది. ముంబైకు రెండురెట్లు సామర్ధ్యంతో మూడు సముద్రపు కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ ఛేంజర్‌గా గూగుల్ సంస్థ నిలవనుంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడానికి మైక్రోసాఫ్ట్ ఏవిధంగా గేమ్ ఛేంజర్ ప్రాజెక్టుగా నిలిచిందో.. నేడు గూగుల్ విశాఖకు రావడం వలన ఏపీ భవిష్యత్ అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌గా మారనుంది.












