విజయవాడ (చైతన్యరథం): నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం జోగి రమేష్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. ఆరేపల్లి రామును విడిగా విచారించిన పోలీసులు తరువాత విడిచిపెట్టారు. అవసరమైనప్పుడు విచారణకు పిలిస్తే రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. జోగి రమేష్‌ను సిట్, ఎక్సయిజ్ అధికారులు 12 గంటపాటు సుదీర్ఘంగా విచారించిచారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రామును విడివిడిగా, కలిసి విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలు, ఆఫ్రికా వెళ్లే ముందు ఇంటికి వచ్చి జనార్దన్ కలిసిన విషయంపై అధికారులు ప్రశ్నించారు. జనార్దనరావు చెప్పిన వివరాల ప్రకారం పూర్తి స్థాయి ఆధారాలు, నగదు లావాదేవీలు లభించాయి. జోగి రమేష్ సోదరుడు రాము ద్వారా నకిలీ మద్యం వ్యాపారాన్ని నిర్వహించారని స్పష్టత వచ్చింది. అనంతరం జోగి రమేష్‌ను ఈ కేసులో ఏ`18 నిందితుడిగా, ఆయన సోదరుడు రామును ఏ`19గా చేర్చారు.
జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రావు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టమని సూచించారని చెప్పారు. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. ఈ మేరకు రాతపూర్వకంగా వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ విచారణ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు.
అయితే, జోగి రమేష్ మాత్రం తనకు జనార్దన్ రావు అనే వ్యక్తి అసలు తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిరచారు. జనార్దన్ రావును తానెప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. కానీ జోగికి ఆయన బాగా పరిచయస్తుడనేందుకు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావుతో జోగి రమేష్ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు జనార్దన్ రావు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది.
జోగి ఇంట్లో సోదాలు, ఫోన్లు స్వాధీనం
నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి జోగి రమేష్ ఇంట్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీంలతో కూడిన బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి. పలు హార్డ్ డిస్క్‌ల ను సిట్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జోగి రమేష్‌కి సంబంధించిన రెండు ఫోన్లు, ఆయన భార్య వాడిన మరో ఫోన్‌ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. జోగి రమేష్ ఇంటి సీసీ టీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. జోగి రమేశ్ ఇంట్లో క్లూస్ టీమ్ అధికారులు సోదాలు పూర్తి చేశారు.
వైసీపీ హయాంలో విచ్చల విడిగా..
అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ విచ్చలవిడిగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో యథేచ్ఛగా నకిలీ మద్యం విక్రయించారు. ఎన్ని జిల్లాల్లో వీరి వ్యాపారం సాగిందనేది విచారణలో వెల్లడి కానుంది. తాను చేసిన తప్పుడు వ్యాపారాలను కూటమి ప్రభుత్వానికి అంటించడానికి ఆయన చేసిన కుట్ర.. ఆయన పాత వ్యాపారాలు వెలుగులోకి రానున్నాయి. గతంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు అగ్రిగోల్డ్ స్థలాలను కాజేయడం వరకూ జోగి రమేష్‌పై పలు కేసులు ఉన్నాయి. కానీ ఆయనను అరెస్టు చేసే వరకూ పోలీసులు వెళ్లలేదు. ఇదే అలుసుగా చేసుకుని ఆయన తన నకిలీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి వాడుకున్నారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మకిలిని దానికి అంటగట్టేందుకు అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుల్ని పావులుగా వాడి జోగి పెద్ద కుట్ర చేశారు. అయితే పోలీసులు తీగ లాగడంతో అసలు విషయం బయటపడిరది. తనను బలిపశువును చేయడంతో అద్దేపల్లి జనార్ధన రావు మొత్తం విషయం బయట పెట్టారు. జోగి రమేషే అసలు కుట్రదారు అని వెల్లడిరచారు.
నకిలీ మద్యం కేసులో దొరికిపోవడంతో.. జోగి రమేష్ డ్రామాలు ప్రారంభించారు. వైసీపీ అనుకూల మీడియాలో కూర్చుని సవాళ్లు చేయడం ప్రారంభించారు. తర్వాత గుడిలో ప్రమాణం డ్రామా ఆడారు. నిన్నటికి నిన్న కేసును సీబీఐకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అవేమీ ఆయనను అరెస్టు నుంచి తప్పించలేకపోయాయి. వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ దందా చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మసిపుయ్యడానికి కుట్రపన్ని తెగించడం జోగి రమేష్ స్వయంకృతం. అడ్డంగా సాక్ష్యాలతో దొరికిపోవడం విధి. పాత కర్మ అనుభవించేలా పాపం పండిరది. ఇందులో సానుభూతి వెతుక్కుంటేనో.. కులం కార్డు చూపిస్తేనో ప్రజలు జాలి చూపించరు.














