అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. తెలుగువారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ అయిన భువనేశ్వరికి ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబరు 4న లండన్‌లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ‘ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు పాటుపడుతున్నందుకు భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడీ సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తోంది. ఈ కార్యక్రమం లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో జరగనుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో ఛైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబరు 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.














