- ఐదేళ్ల పాలనలో దగా చేసిన జగన్ రెడ్డి
- కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ రూ.4000కు పెంపు
- మచిలీపట్నంలో పెన్షన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్యరథం): ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా .. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం పర్యటించారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావుతో పెద్దపట్నం పంచాయతీలోని పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 60 సంవత్సరాలు దాటిన వారికి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుపాను కారణంగా ఇంటి గోడ కూలిపోయిందని ఓ వృద్ధురాలు చెప్పగా తక్షణమే నిర్మించాలని అధికారులకు సూచించారు.
అనంతరం కానూరు గ్రామంలో పర్యటించి గ్రామంలో అభివృద్ధిని పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. మొంథా తుపాను బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, వంట నూనె, కందిపప్పు సహా పలు నిత్యావసర వస్తువులు అందించారు. వర్షం ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తామని, ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మొంథా తుపానుతో రాష్ట్రంలో రూ.5 వేల కోట్లకు పైబడి నష్టం జరిగిందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. పంట నష్టం అంచనా వేసే సమయంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని మంత్రి రవీంద్ర భరోసా ఇచ్చారు.
దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సుమారు 64 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల మంజూరు చేస్తున్నాం. మచిలీపట్నం అర్బన్‌లో 18,297, రూరల్‌లో 11,749 మందికి పెన్షన్లు అందిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా అన్న నందమూరి తారక రామారావు రూ.30తో పేదలకు పెన్షన్లు ప్రకటించారు. తర్వాత దాన్ని చంద్రబాబు రూ.75 చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొక్కుబడి పెంపుతో నిర్లక్ష్యం చేస్తే.. 2014-19 మధ్య చంద్రబాబు రూ.200 నుండి రూ.2000 చేశారు. అధికారంలోకి రాగానే రూ.3000 చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్లు ప్రజల్ని మభ్యబెట్టి ఏటా పెంపు పేరుతో దగా చేశాడు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.4000కు పెంచాం. ఏప్రిల్ నెల నుండే పెంచిన పెన్షన్లు అందించాం. ఏటా రూ.35 వేల కోట్లను పెన్షన్ దారులకు పంపిణీ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో పెన్షన్లు అందించిన దాఖలాలు లేవు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా.. ఒకటో తేదీనే పెన్షన్లు అందించడం కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు..
తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. పేదల కోసం పని చేసే అవకాశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా పేదలకు ప్రతి నెలా రూ.4000 పెన్షన్ ఇంటి వద్దకే అందించడం గొప్పవిషయం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, నాయకులు లంకె నారాయణ ప్రసాద్, మీనవల్లి నాగేశ్వరరావు, గడిదేశి రవి, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.














