- అదే సీఎం చంద్రబాబు నిబద్ధత
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్ల కోసం ఏడాదికి రూ.32 వేల కోట్లు
- పేదల కళ్ళలో ఆనందమే సీఎం ఆశయం
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
- ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి
టంగుటూరు (చైతన్యరథం): భారీ వర్షాలు, తుఫాను వచ్చినా ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందటంలో ఎలాంటి జాప్యం జరగరాదన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. శనివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్ల కోసం ఏడాదికి రూ.32 వేల కోట్లను పేదలకు ఇస్తున్నామన్నారు. పేదల కళ్ళలో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆయన చెప్పారు. తల్లికి వందనం, దీపం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ వంటి సూపర్ సిక్స్ హామీలన్నీ 16 నెలల్లోనే అమలు చేశామన్నారు. మొంథా తుఫాను సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు వివరించారు. చరిత్రలో ఎన్నడు లేనట్లుగా ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడం వలన ప్రాణనష్టాన్ని నివారించగలిగామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.














