- ఏ విపత్తునైనా ఇదే స్ఫూర్తితో ఎదుర్కొందాం
- మొంథా తుఫాన్ ఫైటర్లు అందరికీ ధన్యవాదాలు
- ఉత్తమ సేవకుల్ని అభినందించిన సీఎం చంద్రబాబు
- 137మందికి మెమొంటోలు, ధృవపత్రాల అందజేత
- జిల్లాస్థాయిలోనూ అభినందన కార్యక్రమాలు
అమరావతి (చైతన్య రథం): మొంథా తుఫాన్‌ను టీమ్ స్పిరిట్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సైక్లోన్ మొంథా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మొంథా తుఫాను సమయంలో విశేష సేవలందించిన 137మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ప్రతీ సంక్షోభం మనకు ఒక అవకాశం… ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భతంగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్‌గా రూపొందిద్దామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి ఫలితంగానే మొంథా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
సాంకేతిక సాయంతో అధిగమించాం
‘‘రాష్ట్రానికి రెండు సమస్యలున్నాయి… ఒకటి రాయలసీమకు కరువు, రెండోది కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈరోజు రాయలసీమలో కరవనేది లేకుండా చేశాం. గతంలో హరికేన్ వచ్చింది… ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు వారంనుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగాం. ఈసారి మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్‌ను సిద్ధం చేశాం. వారంతా అద్భుతంగా పనిచేశారు. వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. మోనిటరింగ్, అలెర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ.., ఇలా ఫైవ్ పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించాం. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే హెచ్చరికలు పంపించాం. వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేశాం. అతి పెద్ద తుఫానునుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశాం’’ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం
‘‘డ్రోన్ల ద్వారా తుఫానులో చిక్కకున్నవారి ప్రాణాలు కాపాడాం. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని, ఓ ప్రార్ధనామందిరంలో చిక్కుకున్న 15మందిని కాపాడగలిగాం. అంతా కలిసి చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. 602 డ్రోన్లను ముందుగానే సిద్ధం చేసుకున్నాం. ఓ ఎస్‌ఓపీని తయారు చేసుకుని శాటిలైట్లు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి అలెర్టులు పంపించాం. ముందస్తు జాగ్రత్తగా కాలువల పూడికలు, అడ్డంకులు తొలగించాం. అందుకే భారీ వర్షాలు కురిసినా నీరు కిందికి సులువుగా ప్రవహించింది. తద్వారా వరద ముప్పు తగ్గింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారు. సీఎస్ స్థాయినుంచి గ్రామస్థాయి వరకూ అంతా కలిసి ప్రజలను కాపాడటంలో సఫలీకృతమయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసులు అంతా బాగా పనిచేశారు. అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపించాం. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్పూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రజలు కూడా ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. వారి సహకారం కూడా ప్రభుత్వానికి అవసరం అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
త్వరలో గ్రామస్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థ
అలాగే, గతంలో ఏ అంశం చెప్పాలన్నా గ్రామాల్లో టాంటాం వేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో రాజధాని నుంచే గ్రామస్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, డోలా బాలవీరాంజనేయ స్వామి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














