- ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండాలి
- కూటమి పార్టీల శ్రేణులు సహాయచర్యల్లో పాల్గొనాలి
- ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
- మంత్రి లోకేష్ దిశానిర్దేశం
అమరావతి: మొంథా తుపాను దృష్ట్యా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి.. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. ‘మొంథా’ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున కాకినాడ ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.కూటమి పార్టీల కేడర్ కూడా అవసరం మేరకు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంతాలు, లంకగ్రామాల ప్రజల కోసం సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు అంబులెన్స్లు, ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జాగ్రత్త పడాలని, కమ్యూనికేషన్ సమస్య రాకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల న్నారు. చెరువుగట్లు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంటపొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మొంథా తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుపాను బాధితులకు ఎటువంటి సాయం అవసరమైనా వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24 గంటలూ సిద్ధంగా ఉంటుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.












