- నేటి నుంచి పెరగనున్న తుపాను ప్రభావం
- 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం
- రియల్ టైంలో ప్రజలకు సమాచారం
- రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు
- ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే అవకాశం
- మంత్రులు, అధికారులతో రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్యరథం): మొంథా తుపాను ప్రభావం రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే మొంథా తుపానుపై ఆందోళన వద్దని… అప్రమత్తంగా ఉందామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 10 గంటలకు మరోసారి తుపాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్ లో సీఎం సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్తో పాటు… రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి తుపాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం సూచించారు.అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటి వరకు తుపాను సన్నద్ధతపై ఐవిఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైనా సీఎం సమీక్ష చేశారు.
అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారు అనేది కాదు… క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని… దీనికి పబ్లిక్ పర్సెప్షన న్ను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం అన్నారు. తుపానుపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. అదే విధంగా తుపానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీ మీ.. ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అని అంశంపై 70 శాతం మంది అవును అని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెపుతున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఇదే విధానాన్ని కొనసాగించాలని… ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు… వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేశామని….. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాల వారిని మైక్ ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయం లోపు తుపాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముప్పు తప్పే వరకు ప్రతీ శాఖ, ప్రతీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సూచించారు.












