- తీరప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించండి
- ప్రతీ కేంద్రానికి ఇన్ఛార్జ్… నాణ్యమైన ఆహారం, మెడికల్ క్యాంపులు
- తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు
- వాలంటరీగా వచ్చేవారితోనూ సహాయక చర్యలు చేపట్టండి
- జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నిర్దేశం
అమరావతి (చైతన్యరథం); మొంథా తుపాను ముప్పు ఉన్న తీరప్రాంత ప్రజలను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం నుంచి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్లను నియమించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుపానుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని చెప్పిన సీఎం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు నిర్దేశించారు. జిల్లాల్లో తుపాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, వాలంటరీగా వచ్చేవారిని కూడా తుపాను సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ యంత్రాం గమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవాలని సీఎం స్పష్టం చేశారు.
కొండచరియలు జారిపడకుండా జాగ్రత్తలు
మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదని చెప్పిన ముఖ్యమంత్రి… వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని… అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని సీఎంకు ఆ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి సమాచారం ఎప్పటికప్పుడు అందుతుందని… ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించా లన్నారు. తుపాను సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. విజయవాడ, మంగళగిరి, విశాఖవంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలుచేపట్టాలని నిర్దేశించారు. మొంథా తుపాను కార్యాచరణ భవిష్యత్లో వచ్చే తుపాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని చెప్పారు.












