- తుఫాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నాం
- సాంకేతిక సాయంతో ముప్పును ఎదుర్కొంటాం
- గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాం
- ప్రాణ, పశు, ఆస్తినష్టం వాటిల్లకుండా అప్రమత్తం
- సోషల్ మీడియా కథనాలను నమ్మవద్దు
- ప్రభుత్వ టోల్ నెంబర్లకు
- ఫోన్చేసి వివరాలు తెలుసుకోవచ్చు
- తుపాను సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి (చైతన్యరథం): అత్యాధునిక సాంకేతికత, సమాచార సాయంతో ‘మొంథా’ తుపాను నష్ట నివారణకు ముందస్తు చర్యలను చపట్టినట్టు హోం, విపత్తు నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆదివారం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం హైఅలెర్ట్ ఉందన్నారు. గతంలో సంభవించిన తుఫాన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తినష్టం వాటిల్లకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడచిన రెండు రోజులుగా దుబాయ్ నుంచే రాష్ట్ర అధికారులతో పలుమార్లు కాన్ఫరెన్స్లు నిర్వహించి అప్రమత్తం చేశారన్నారు. ఇదే అంశంపై గత నాలుగు రోజుల నుండీ రాష్ట్ర ప్రజలను పలు మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామన్నారు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని జిల్లాలకు నోడల్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించినట్టు వెల్లడించారు. 6 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సన్నద్ధం చేశామని, హెలికాప్టర్లతో నావెల్ అధికారులను సిద్ధం చేశామన్నారు. అన్నిచోట్లా హెలీపాడ్లను కూడా సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు. అవసరమైతే బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. తీరప్రాంతాల్లో 14 బోట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. తుఫాను సందర్భంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భారీగా గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల హోర్డింగులను తొలగించాలని ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటికే మంత్రులవారీగా శాఖలపై క్షేత్రస్థాయి అధికారుల వరకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా.. వినియోగించేందుకు జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశామన్నారు. విపత్కర పరిస్థితుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే.. నదులు, సముద్ర తీరాల్లో అన్ని బోటింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.
బీచ్లకు పర్యాటకుల ప్రవేశం నిషేధించాలని, జిల్లా, మండలాల కంట్రోల్ రూమ్ నెంబర్లు విస్తృతంగా ప్రచారం చేయాన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అత్యవసరమైతే తప్ప రెండు రోజులపాటు బయటకు రావొద్దని సూచించారు. ఇళ్లు ప్రమాదకరంగా ఉంటే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని, ఏ సహయమైనా.. స్టేట్, జిల్లాల కంట్రోల్ రూమ్కు ఇవ్వాలంటూ.. స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 . ఇక ఇరిగేషన్ అధికారులు కాలువలు, వాగులకు ఉన్న అడ్డంకులు తొలగించాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలతో పాటు స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవాలన్నారు. సహాయ శిబిరాల రూట్ మాప్స్ ముందే. చూసుకోవాలని, రిలీఫ్ క్యాంపులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, మెడికల్, విద్యుత్తు శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి అనిత సూచించారు.
తుఫానుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల టోల్ నెంబర్కు ఫోన్ చేసి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చని, తక్షణ సహాయం కూడా పొందవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తక్షణ సహాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సమావేశంలో పాల్గొన్నారు.












