- అవాస్తవ ప్రచారాలపై చర్యలు తీసుకోండి
- పోలీసులను ఆదేశించిన ఐటీ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తోన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకులో జరిగినట్టు ఒక కథనం రాశారన్నారు. దీన్ని వైకాపా అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే వార్త, వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో ‘ఫ్యాక్ట్ చెక్’లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినట్టు గుర్తు చేశారు. అయినా మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ అంటారని పేర్కొంటూ.. అందుకే అది ఒక రాజకీయ పార్టీనా? ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ ముఠానా? అనే అనుమానం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్దికోసం కొందరు సాగిస్తోన్న అసత్య ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని ఐటీ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.














