- బస్సు ప్రమాదంతో బెల్ట్ షాపులకు లింకు పెట్టే పన్నాగం
- అవాస్తవ ప్రచారాలను ఖండిస్తూ..ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్
కర్నూలు (చైతన్య రథం): కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కొందరు పనిగట్టుకొని చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. వాస్తవాలను విస్మరిస్తూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ భాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. “బస్సు ప్రమాదం ఘటనపై సాక్షి పత్రికలో, వైకాపా సోషల్ మీడియాలో చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. రాష్ట్రంలో బెల్టాపులు పెరిగి పోయాయని, బస్సు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చేస్తోన్న ప్రచారం అవాస్తవం. అతడు పెద్దటేకూరు గ్రామంలోని లైసెన్స్ రిటైల్ మద్యం దుకాణంలో రాత్రి 7 గంటలకు ఒకసారి, రాత్రి 8.25కు మరొకసారి మద్యం కొనుగోలు చేసినట్టు సీసీ కెమెరాల ఆధారంగా వెల్లడైంది. ప్రమాదం జరిగింది తెల్లవారుజామున. వాస్తవాలు ఇలాఉండగా తప్పుడు ప్రచారం చేయడం నేరం. ఇలా అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం” అని ప్రభుత్వం హెచ్చరించింది.














