అమరావతి (చైతన్య రథం): ఈ దశాబ్దం మోదీదే. ఎన్డీయే ప్రగతిశీల ప్రభుత్వం -అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. బిహార్ సీఎం నీతీశ్ కుమార్, అధికార కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. దుబాయ్ పర్యటన సమయంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల సాధికారతే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. “ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల హామీ ‘సూపర్ సిక్స్’ను విజయవంతంగా అమలు చేస్తోంది” అన్నారు. “భారత్లో ఎంతో ఆసక్తి కలిగించే అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంటారు.
గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014నుంచి 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో నాలుగేళ్లు ఆయనే ఉంటారు. ఈ దశాబ్దం మోదీదే. అంటే ఆటోమెటిగ్గా భారతీయులదే” అని చంద్రబాబు వెల్లడించారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై చంద్రబాబు మాట్లాడారు. వాటివల్ల ప్రజల పొదుపు పెరుగుతుందన్నారు. ఎంఎస్ఎంఈ రంగం, ఇతర వ్యాపారవేత్తలు సంతోషంగా ఉన్నారన్నారు. ఏ దేశ తలసరి ఆదాయంలోనైనా ఆ దేశంలో నివసించే భారతీయులదే ఆధిపత్యమని అన్నార. దుబాయ్ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో పాల్గొనాలని ఆహ్వానించారు. వచ్చే నెలలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు ఆంధ్రాలో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, ఉద్యానరంగం, లాజిస్టిక్స్, రాజధాని నగరం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని వివరించారు.
750 వరకు సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామంటూ రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి పేర్కొన్నారు. అలాగే తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ… భవిష్యత్లో ఒకరోజు ఈ గ్రహంపై అత్యంత ప్రభావవంతమైన సమాజంగా తెలుగు కమ్యూనిటీ నిలుస్తుందని, ఆ దిశగా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. గత 15 నెలల్లో తమ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సేకరించిందని, మరో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.














