- ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన
- మూడొవరోజూ క్షణం తీరికలేకుండా భేటీలు, సమావేశాలు
- త్వరలో యూఏఈ `ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం
- పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు వ్యూహాత్మక అడుగు
- సమర్థ వాగ్దాటితో ఏపీపై ఆశలు చిగురింపచేసిన ముఖ్యమంత్రి
- రాష్ట్రంలో అవకాశాలు పరిశీలించాలంటూ యూఏఈ మంత్రులకు ఆహ్వానం
- చివరిరోజూ పలు సంస్థల ప్రతినిధులను ఉత్సాహంగా కలిసిన సీఎం
దుబాయ్ (చైతన్య రథం): యూఏఈలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ఆశావహంగా ముగిసింది. అటు ప్రభుత్వ ప్రతినిధులు, ఇటు వాణిజ్య సంస్థ అధిపతులతో వరుస సమావేశాలతో యూఏఈ-ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధానికి తెరతీశారు. రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. పర్యటన చివరిరోజు శుక్రవారం దుబాయ్‌లో ముఖ్యమంత్రి పలువురు యూఏఈ మంత్రులను, అక్కడ వాణిజ్య సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ముందుగా యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో భేటీ అయ్యారు. యూఏఈ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధాన్ని పెంపొందించే అంశంపైనా, లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల గురించి ఇరువురు నేతలు చర్చించారు. భారత్-యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్టుగానే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై ఏపీకి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై ఇరువురు అవగాహనకు వచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యంగా ఆహార భద్రతకు సంబంధించి ఏపీతో కలిసి పనిచేసేందుకు యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి ఆసక్తి కనబరిచారు.
యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో భేటీ
యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదితోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పక్షాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం అంశాలపై చర్చ జరిగింది. థానీ బిన్ అహ్మద్ భారతదేశం -యుఏఈల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధాన్ని ప్రస్తావిస్తూ, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, పెట్రో కెమికల్స్, రియల్ ఎస్టేట్‌వంటి రంగాల్లో భాగస్వామ్యంతో పాటు… ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టే అంశంపై థానీ ఆసక్తి చూపించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని థానీ అన్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం
దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపా రాజా కార్బన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై చర్చలు జరిపారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్, బ్లాక్‌చైన్, వర్చువల్ అసెట్ రెగ్యులేషన్, క్రిప్టో, డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్`దుబాయ్ మధ్య భాగస్వామ్య అవకాశాలను ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఏపీ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో ముందంజలో ఉందని, ఫిన్‌టెక్ వాలీ విశాఖపట్నం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌వంటి ప్రాజెక్టులు డిజిటల్ ఇన్నోవేషన్‌కు కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. వర్చువల్ అసెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, డిజిటల్ కరెన్సీ సేఫ్టీ నార్మ్స్, బ్లాక్‌చైన్ ఆధారిత ప్రభుత్వ సేవల అమలుకు సంయుక్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. దీనికి దీపా రాజా సుముఖత వ్యక్తం చేశారు. అలాగే, క్రౌన్ ఎల్‌ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియాతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఎల్‌ఎన్జీ, గ్రీన్‌ఎనర్జీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్`క్రౌన్ ఎల్‌ఎన్జీ మధ్య భాగస్వామ్య అవకాశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తామని కటారియా చెప్పారు.
మరోవైపు ట్రైస్టార్ గ్రూప్ సీఈఓ యూజిన్ మేయిన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి లాజిస్టిక్స్, ఇంధన రవాణా, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, గ్రీన్ ఫ్యూయెల్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఏపీ సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉందని… పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ హబ్‌ల అభివృద్ధికి ఆస్కారం ఉందని తెలిపారు. ఆస్టర్ గ్రూప్ స్థాపకుడు డాక్టర్ అజాద్ మూపెన్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సమావేశంలో ఆరోగ్య సేవల విస్తరణ, మెడికల్ ఎడ్యుకేషన్, టెలీ`హెల్త్, హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, హెల్త్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఏపీలో ఆస్టర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయ స్థాయి మెడికల్ సదుపాయాలు స్థాపించాలని ఆహ్వానించారు. దీనికి అజాద్ మూపెన్ ఆసక్తి వ్యక్తం చేశారు. అపారెల్ గ్రూప్ సీఈఓ నీలేశ్ వేద్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. టెక్స్‌టైల్, గార్మెంట్ తయారీ, రిటైల్, ఫ్యాషన్ పరిశ్రమ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకుగల అవకాశాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. దీనికి స్పందించిన నీలేశ్ వేద్ ఏపీలో అపారెల్ మాన్యుఫాక్చరింగ్, రిటైల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి గురించి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.











