- కేవలం 6గంటల్లో బీమా సొమ్ము మంజూరు
- కర్నూలు బస్సు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త గోళ్ల రమేష్ కుటుంబం దుర్మరణం
- ఆస్ట్రేలియా నుండి స్పందించిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): కార్యకర్తలకు కష్టమొస్తే క్షణం ఆలోచించకుండా సాయమందించడం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ నైజం. కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్గటనలో నెల్లూరుజిల్లా చాకలికొండకు చెందిన తెలుగుదేశం కార్యకర్త గోళ్ల రమేష్, ఆయన భార్య అనూష, వారి ఇద్దరు పిల్లలు కూడా దుర్మరణం పాలయ్యారు. పార్టీ యంత్రాంగం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, తీవ్ర ఆవేదన చెందిన యువనేత లోకేష్ తక్షణమే వారి కుటుంబానికి వెంటనే సాయం అందేలా చూడాలని ఆదేశించారు. లోకేష్ ఆదేశాలు అందుకున్న వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది రంగంలోకి దిగి ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో సంప్రదించారు. ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు కూడా మానవతా దృక్పథంతో వెనువెంటనే స్పందించారు. కేవలం ఆరుగంటల వ్యవధిలో క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి పరిష్కరించారు. మృతులు గోళ్ల రమేష్, అనూషల కుటుంబ సభ్యులకు చెరో 5లక్షల చొప్పున ఇన్సూరెన్స్ సొమ్ము మంజూరైంది. శని, ఆదివారాలు బ్యాంకు సెలవు దినాలు కావడంతో సోమవారం గోళ్ల రమేష్, అనూష కుటుంబాలకు ఇన్సూరెన్స్ సొమ్ము అందనుంది. యువనేత లోకేష్ చొరవతో తెలుగుదేశం పార్టీకి చెందిన కోటిమందికిపైగా కార్యకర్తలకు ఈ ఏడాది నుంచి రూ.5 లక్షల ప్రమాద బీమా చేయించిన విషయం తెలిసిందే. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు రూ.135 కోట్లు సాయం అందించారు.










