ఏపీ- యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేందుకు సహకరించండి
షిప్ బిల్డింగ్‌నుంచి డేటా సెంటర్ల వరకూ ఏపీలో అపారమైన అవకాశాలు
యూఏఈలోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పాటు అందించండి
మోదీ చొరవతోనే భారత్‌లో విప్లవాత్మక మార్పులు
దుబాయ్‌లోని భారత ఎంబసీ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు
దుబాయ్ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్- యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం మరింత బలపడేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు. పెట్టుబడుల సాధనకు, నవంబర్‌లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సీఎం చంద్రబాబు దుబాయ్ చేరుకున్నారు. దిగిన వెంటనే దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్‌కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిధ్యరంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్ 15 బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెడుతోందని సీఎం వారికి వివరించారు. ఏపీకి 1054 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడిరచారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. యూఏఈ దేశాల సావరీన్ ఫండ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైనా వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. యూఏఈ -ఏపీ పారిశ్రామిక బంధం ధృఢంగా ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ దేశాలకు చెందిన వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లోని కంపెనీలకు వివరించాలని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందన్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని… యూఏఈలోని వివిధ సంస్థలను సదస్సుకు ఆహ్వానిస్తున్నామని దుబాయిలోని భారత ఎంబసీ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రధాని మోదీ చొరవవల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని.. భారత్‌ను పెద్దఎత్తున ఆయన ప్రమోట్ చేస్తున్నారన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని చేస్తోన్న కృషే కారణమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విద్య వైద్యరంగాల్లో యూఏఈ ఆసక్తి
ట్రేడ్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ దేశానికి యూఏఈ భాగస్వామిగా ఉందని దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ సతీష్ కుమార్ శివన్ వివరించారు. ఇరుదేశాల పరస్పర పెట్టుబడులతో బంధం మరింత బలపడిరదని సీఎంకు వివరించారు. మూడేళ్లలో 50శాతంమేర ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగిందన్నారు. ప్రస్తుతం యూఏఈ టెక్నాలజీ రంగంపై ఎక్కువగా వ్యయం చేస్తోందని భారత్‌నుంచి వచ్చే నిపుణులకు భారీఎత్తున అవకాశాలున్నాయని సీఎంకు వివరించారు. ప్రస్తుతం యూఏఈ నాన్ ఆయిల్ ఎకానమీ వైపుగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై యూఏఈ 2017లోనే ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని సీఎంకు సతీష్ కుమార్ శివన్ తెలిపారు. మరోవైపు యూఏఈలో 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌లో పెట్టిందని ఇందులో 50 శాతం గత మూడేళ్లలో వచ్చినవేనని యూఏఈలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఎ అమర్నాథ్ తెలిపారు. భారత్‌లోని విద్య వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి చూపుతోందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ పార్క్‌లోనూ యూఏఈ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ తెలిపారు. సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎంకు సాదర స్వాగతం
దుబాయ్‌లోని అంతర్జాతీయస్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. యూఏఈలో తెలుగువాళ్లు ఉన్నారని… వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దుబాయ్‌లో తన పర్యటన చివరి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకుముందు హైదరాబాద్‌నుంచి దుబాయ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దుబాయిలో ఉన్న తెలుగువారు.. ప్రత్యేకించి మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని సీఎం అప్యాయంగా పలకరించారు.










