- కాంట్రాక్టర్లకు త్వరితగతిన బిల్లులు చెల్లిస్తాం
- నాణ్యతలో రాజీపడొద్దు
- సమీక్షా సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశం
- వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన కాంట్రాక్టర్లు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోని రహదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గుంతలు, గోతుల రహిత రహదారుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విజయవాడలోని ఈఎన్సీ కార్యాలయంలో ఎన్డీబీ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్) పనులపై ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎం. టీ కృష్ణబాబుతో కలిసి శుక్రవారం మంత్రి సమీక్షించారు.. ఈ సందర్భంగా ఎన్డీబీ పనుల స్థితి గతులపై ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, ఎన్డీబీ కాంట్రాక్టర్లతో మంత్రి మాట్లాడారు..
నాణ్యతలో రాజీవద్దు
ఎన్డీబీ రహదారుల పనులు జాప్యం కావడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు త్వరతగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదే సమయంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దన్నారు. ఎన్డీబీ ప్రాజెక్టు కింద తగ్గించిన పనులకు సంబంధించి కొత్త అంచనా వ్యయంతో కూడిన నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.. అదే క్రమంలో కాంట్రాక్టర్లకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ విషయంలో వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎన్డీబీ రహదారులను కుదించే క్రమంలో వంతెనలు, కల్వర్టులు మినహాయించి కేవలం రహదారుల నిర్మాణం మాత్రమే చేపడితే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, అలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో వేగం పెంచాలి
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన ఎన్డీబీ రోడ్ల పనులను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పట్టాలెక్కించి, కాంట్రాక్టర్లకు పెండిరగ్ బిల్లులు దాదాపు రూ. 239 కోట్ల మేర చెల్లించామన్నారు.. అయితే అనంతరం అనివార్య కారణాలతో పనుల్లో వేగం పుంజుకోలేదని తెలిపారు. ఎన్డీబీ రహదారుల పనులకు సంబంధించి రూ. 1680.97 కోట్లతో 85 రోడ్ల పనులను 682 కి.మీ కు కుదించారు. అనంతరం కాంట్రాక్టర్లతో మాట్లాడి నిలిచిన పనులను తిరిగి పట్టాలెక్కించాం. ఇందులో ఇప్పటికే 546 కి.మీ మేర పనులు ప్రారంభించగా, 236 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. రూ. 932.99 కోట్ల మేర పనులు పూర్తి చేశాం. ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాదాపు 747.98 కోట్ల పనులు పూర్తి చేసి, రూ. 434 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించాం. రూ. 161 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్ కింద ఇప్పటికే అప్ లోడ్ చేశాం. దాదాపు రూ.151 కోట్ల మేర బిల్లులు ఇంకా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 44.49 % మేర పనులు పూర్తి చేశాం. అయితే దాదాపు 6 జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువ పనులు మాత్రమే జరిగిన క్రమంలో ఆయా జిల్లాల్లో అధికారులు పనులు వేగం పెంచేందుకు మరింత దృష్టిసారించాలని మంత్రి ఆదేశించారు.
త్వరలోనే పెండిరగ్ బిల్లుల చెల్లింపు
ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ.. మార్చి 2026 లోపు ఎన్డీబీ రోడ్లకు సంబంధించి పెండిరగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. అదే సమయంలో తమ పెండిరగ్ బిల్లులు త్వరితగతిన అందజేయాలని మంత్రికి విన్నవించారు. ఎన్డీబీ కాంట్రాక్టర్లకు త్వరలోనే పెండిరగ్ బిల్లులు చెల్లించి, ఆయా పెండిరగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహాకరిస్తామని మంత్రి తెలిపారు. రహదారుల అభివృద్ధిలో దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోని రహదారులకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రహదారుల అభివృద్ధి పనుల్లో… గతంలో ఎన్డీబీ, సీఆర్‌ఐఎఫ్ కింద రద్దయిన 650 కి.మీ పనులకు అత్యంత ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను మంత్రి నొక్కిచెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ముగిసిన క్రమంలో రహదారులు మరమ్మతులు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన అవసరాన్ని మంత్రికి అధికారులు తెలియజేశారు..
మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎం.టి కృష్ణబాబు, చీఫ్ ఇంజనీర్లు శేషు కుమార్, విజయశ్రీ, తదితర ఉన్నతాధికారులు, ఎన్డీబీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు..