- అధికారులకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
- సాలూరు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శ
సాలూరు (చైతన్యరథం): అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో వివిధ హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యానికి గురికావటంతో మంత్రి శుక్రవారం స్వయంగా వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్యం కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితి తనకు ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. చిన్నారులు డిశ్చార్జ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. పీహెచ్‌సీ డాక్టర్ల సమ్మె కారణంగా వివిధ ప్రాంతాల నుండి 6 హాస్టళ్ల విద్యార్థులను సాలూరు సీహెచ్‌సీలో చేర్పించారు. ఆ ఆరు హాస్టళ్లలో 4 గిరిజన, ఒక సోషల్ వెల్ఫేర్, ఒక కేజీబీవీ హాస్టల్ ఉన్నాయి. విద్యార్థుల అనారోగ్య వార్త తెలుసుకున్న వెంటనే సాలూరు సీహెచ్‌సీకి చేరుకున్న మంత్రి సంధ్యారాణి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మొత్తం 21 మంది విద్యార్థులను మంత్రి స్వయంగా పరామర్శించారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు జాండీస్ (పసుపు జ్వర లక్షణాలతో) ఒక విద్యార్థి మలేరియాతో బాధపడుతున్నారు. మిగిలిన విద్యార్థులు సాధారణ జ్వరం, అలసట వంటి తేలికపాటి సమస్యలతో ఉన్నారని వైద్యులు వివరించారు. జాండీస్, మలేరియా బాధిత విద్యార్థులకు తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో విద్యార్థులను స్వయంగా పరామర్శించిన మంత్రి వారికి ధైర్యం చెబుతూ, ప్రభుత్వం మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ చూపిస్తుంది. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా హాస్టళ్లలో ఆహారం నాణ్యత, తాగునీరు, పరిశుభ్రత, పాఠశాల పరిసరాలలో వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అంశాలపై పూర్తిస్థాయి సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడిన మంత్రి విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పిల్లలు త్వరగా కోలుకొని తిరిగి పాఠశాలలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.