- అభివృద్ధి, సంక్షేమ రంగాలపై చిత్తశుద్ధితో ప్రభుత్వం
- పేదలకు వరంలా సీఎంఆర్‌ఎఫ్
- పీపీపీ విదానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తూర్పు నాయుడుపాలెం (చైతన్యరథం): రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం, ఆలోచన అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు రూ.30.14 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) వరంలాంటిదన్నారు. పేద ప్రజలు ఆనారోగ్యం పాలై ఆసుపత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. వారిలో కొండపి నియోజకవర్గ పరిధిలో 45 మందికి 30 లక్షల 14 వేల రూపాయలు మంజూరు కాగా, వారికి చెక్కులను అందజేశామన్నారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 925 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 57 లక్షల 64 వేల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకువస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషన్ చేసి సంజీవిని పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఇన్స్యూరెన్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్‌తో వైద్య కళాశాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందించి వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డా.స్వామి తెలిపారు.