- మంత్రులతో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు
- గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ అభినందనలు
అమరావతి (చైతన్య రథం): ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో నాలుగోసారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని… వీటిల్లో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. సభ మంచి మెసేజ్ ఇచ్చిందని సీఎం ప్రస్తావించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారని అభినందించారు. ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని అంటూ.. శ్రీశైలం మల్లన్న ఆలయ దర్శనంపై ప్రధాని ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారని సీఎం వివరించారు. ప్రధాని మోదీ సైతం సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను అభినందించారని సీఎం చెప్పారు. జీఎస్టీపై నెలపాటు సాగించిన ప్రచార కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సీఎం అధికారులను ఆదేశించారు.