అమరావతి (చైతన్య రథం): పేదరిక నిర్మూలన అంటే.. నిరుపేద వర్గాలకు ఆర్థిక సాయం అందించడమే కాదు.. వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడిరప చేయడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం సందర్భంగా ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘పేదరిక నిర్మూలన అంటే.. నిరుపేదలు ఎదగడానికి అవకాశాలను కల్పించడం. అందరితో సమానంగా వారిని ముందుకు నడిపించడం. స్వర్ణాంధ్ర విజన్ 2047లోని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచీ పనిచేస్తోంది. 16 నెలల్లో లక్ష కోట్ల రూపాయలకు మించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా నెలనెలా రూ.2,758 కోట్లతో ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు’ అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 207 ‘అన్న క్యాంటీన్లు’ పునఃప్రారంభించి రూ.5కే పేదల ఆకలి తీరుస్తున్నాం. ‘దీపం 2.0’ పథకంతో పేదింటి మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం.
పేదింటి పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మొదటి విడతగా రూ.7,000లు జమ చేశాం. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.246 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కింద రూ.435 కోట్లు ఇచ్చాం. ఇలా సంక్షేమ పథకాలు ఇస్తూనే పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంచుకున్న మార్గమే ‘పి-4 జీరో పావర్టీ’ కార్యక్రమం. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం సందర్భంగా ఈ లక్ష్యానికి మనందరం పునరంకితమవుదాం అని పిలుపునిస్తూ…. పి-4 కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.