- సమష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్
- రాష్ట్ర ప్రజలంతా గర్వించే సమయమిది..
- 20లక్షల ఉద్యోగాల సాధనకు నిరంతరం కృషి
- ఇక ప్రతివారం ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్లు ఖాయం
- 17నెలల్లో ఇన్వెస్టిమెంట్ అట్రాక్ట్ స్టేట్‌గా ఏపీని నిలపాం
- రాష్ట్రానికి రావొద్దంటూ గూగుల్‌కూ మెయిళ్లు పెట్టారు
- వైసీపీతో రాష్ట్రానికి చేటు.. ఆ పార్టీతో అంతా విధ్వంసమే
- మీడియా సమావేశంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా కేవలం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘2014-19 నడుమ ఇండియా లార్జెస్ట్ ఆటోమోటివ్ ఎఫ్‌డిఐ కియాను చంద్రబాబు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్‌డిఐ ఇన్వెస్టిమెంట్ ఇన్ హిస్టరీ, ఏపీలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. అమెరికా వెలుపల గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇది. అనేక దేశాలు, రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఏపీకి వెళ్తేనే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ వల్ల పెట్టుబడి పెట్టగలం, ఇబ్బంది ఉండదని గ్రహించి రాష్ట్రానికి వచ్చారు. గూగుల్ రాక ఏపీ గెలుపు కాదు, భారతదేశం గెలుపు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిన విధంగానే… ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోంది. ఇది కేవలం ఒక్క డాటా సెంటర్ గురించి మాత్రమే కాదు. కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏఐకి సంబంధించి అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం దీనిద్వారా 25రెట్ల ఆర్థిక ప్రభావం ఉంటుంది. అలాంటి ఎకనమిక్ యాక్టివిటీ గూగుల్ చేయబోతోంది. ఈ ఒక్క పెట్టుబడివల్ల 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఐదేళ్లలో రూ.48వేలకోట్ల ప్రభావం చూపుతుంది’’ అని స్పష్టం చేశారు.
గూగుల్ కోసం చట్టాల్లో సవరణలు చేశాం
సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినపుడు డాటాసెంటర్ స్థలం చూపించాను. నెల తర్వాత నేను అమెరికా గూగుల్ క్లౌడ్ లీడర్ షిప్‌ను కలిశాను. అనంతరం నవంబర్‌లో వారు ముఖ్యమంత్రి కలిశారు. ఆ సమయంలో గూగుల్ ప్రతినిధి బృందం ఏపీలో కాకుండా దేశంలోనే కొన్ని చట్టాలను సవరించాలని కోరారు. దీనిపై నేను అశ్వనీవైష్టవ్ దృష్టికి తీసుకెళ్లాను. ఈ అంశంపై ముఖ్యమంత్రి పలుమార్లు నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ప్రధాని మంత్రిని గూగుల్ పెట్టుబడిపై రెండుసార్లు కలసి చర్చించిన తర్వాత చట్టాల్లో అవసరమైన సవరణలు చేశారు. అందువల్లే ఇంతపెద్ద ఇన్వెస్టిమెంట్ ఏపీకి, భారతదేశానికి వచ్చింది. ఐటి సెక్రటరీ భాస్కర్, కార్తికేయ మిశ్రావంటి సీనియర్ అధికారులు ఈ ప్రాజెక్టు కోసం గ్రౌండ్ వర్క్ చేశారు. అందరం కలసికట్టుగా సమన్వయంతో పనిచేసి విశాఖపట్నానికి ఈ భారీ పెట్టుబడి తెచ్చాం. ఏపీ సాధించింది. భారతదేశం సాధించింది. ఇది అందరం గర్వపడాల్సిన సమయం. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం గురించి మాట్లాడుతోంది. భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వచ్చిందని చర్చించుకుంటోంది’’ అని లకేష్ ఉత్సాహంగా ప్రకటించారు.
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం
‘‘మా లక్ష్యం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. కియా మోటారుతో అనంతపురాన్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం. నార్త్ అనంతపురం, కర్నూలులో ఇప్పటికే పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలులో రెండు కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతులిచ్చాం. మరో అయిదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తాం. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే అనేక పెట్టుబడులు వచ్చాయి. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో మా ప్రభుత్వం వచ్చాక అనేక పెట్టుబడులు తీసుకువచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే దేశంలో 50శాతం ఏసీలు ఏపీలో తయారవుతున్నాయి. డైకిన్, బ్లూస్టార్ విస్తరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే 80శాతానికి చేరుకునే అవకాశం ఉంది. స్పేస్ సిటీ రావాలన్న ఉద్దేశంతో ఇండియా స్పేస్ ఎక్స్ సంస్థ స్క్రై రూట్‌కు 300 ఎకరాలు, ఎకరా 5 లక్షలకు ఇచ్చాం. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తోంది. జనవరినుంచి క్వాంటమ్ కంప్యూటర్‌కు సంబంధించి ఎకో సిస్టమ్ ఇక్కడకు తీసుకువస్తున్నాం. ఉభయగోదావరి ఆక్వా పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలను తీసుకువస్తున్నాం’’ అని లోకేష్ వివరించారు.
ఉత్తరాంధ్రకు భారీఎత్తున పెట్టుబడులు
‘‘ఉత్తరాంధ్రకు భారీఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ ఇండియా లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, రహేజావంటి నిర్మాణసంస్థలు, మెడికల్ డివైస్, ఫార్మా సంస్థలు వచ్చాయి. అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేసి 2024నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్లస్టర్ బేస్డ్ విధానంలో వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్‌తో ముందుకెళ్తున్నాం. 100 కి.మీ.ల పరధిలో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రధాన సంస్థల అనుబంధ యూనిట్లన్నీ ఆ చుట్టుపక్కల వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. హారిజంటల్ విభాగంలో స్కిల్ డెవలప్‌మెంట్, ఎక్విప్‌మెంట్, టెస్టింగ్‌వంటివాటికి ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే జోన్‌లవారీగా అభివృద్ధి చేస్తున్నాం. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్‌తో ముందుకెళ్తున్నాం’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా గ్రేటర్ విశాఖ
గ్రేటర్ విశాఖ ఎకనమిక్ కారిడార్‌ను ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి, ఇంటిగ్రేటెడ్ ప్రణాళికలు (ఎయిర్ పోర్టు, రైల్వే, రహదారులు) రూపొందిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి 30ఏళ్లు పడితే, పదేళ్లలోనే విశాఖను అదేతరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశాఖ, అమరావతి, రాయలసీమ ఎకనమిక్ కారిడార్‌లను ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెం.1గా నిలబడుతుంది. ఎంఓయులను పట్టించుకోకుండా నేరుగా ఎగ్జిక్యూషన్‌కే వెళ్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్‌తో ఇప్పటికీ ఎంఓయు లేదు. నవంబర్‌లో భూమి పూజ చేస్తున్నాం. టీసీఎస్‌కు ఎంఓయు లేకపోయినా నవంబర్‌లో ప్రారంభించబోతున్నామని లోకేష్ స్పష్టం చేశారు.
ఐటి రంగంలో 5 లక్షల ఉద్యోగాలు
‘‘రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నాం. చాలామంది దావోస్ వెళ్లి ఏంచేశారని అడిగారు. దావోస్‌లో గూగుల్ క్లౌడ్ సిఇఓను ముఖ్యమంత్రి కలిశారు. నేను ముంబాయి వెళ్లినపుడు టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించాను. పెట్టుబడుల కోసం క్రియాశీలకంగా, చురగ్గా ముందుకెళ్తున్నాం. టాప్ -10 ఇన్వెస్టర్స్ లిస్ట్ నా బ్యాగులోనే ఉంటుంది. ప్రతివారం వాటిని మా కార్యాలయం ఫాలోఅప్ చేస్తుంది. ప్రతి ప్రాజెక్టుకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. రిలయన్ సిబిజి పరిశ్రమకు ఒకవారం అప్‌డేట్ రాకపోతే నేనే రంగంలోకి దిగుతున్నా. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ఈ లక్ష్యసాధనకు అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక్క ఐటి రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చాలెంజ్‌గా తీసుకున్నాం. రాబోయేరోజుల్లో ప్రతివారం కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటాయి. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు 17 నెలలు మంత్రులందరం కలసి పనిచేస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. 2019-24 నడుమ ఎవరూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదు. వారి హయాంలో కేవలం విధ్వంసమే. మేం వచ్చాక 17 నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్‌గా ఏపీ మారింది. ఇందుకు ప్రధాన కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ కారణం. ఢల్లీిలో ప్రధాని మోడీ, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కలసికట్టుగా కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తేగా, ఒక్క ఫోన్ కొడితే ఏపీలో అమలు చేస్తారనే నమ్మకం వారిలో కలిగింది. లేబర్ రిఫామ్స్‌ను కేవలం 15రోజుల్లో చేసి చూపించాం. మేం అనుకున్నది సాధించాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. ఏపీని అన్నిరంగాల్లో నెం.1గా చేసేందుకు ప్రజలు మాతో కలసిరావాలని మంత్రి లోకేష్ కోరారు.