అమరావతి (చైతన్య రథం): అక్షరమే ఆయుధంగా, సమాజ హితమే లక్ష్యంగా వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సాగుతోన్న అక్షర ప్రయాణానికి విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈమేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘వేమూరి రాధాకృష్ణ వెలిగించిన ఆంధ్రజ్యోతి దినదిన ప్రవర్థమానమై 23 ఏళ్లు, నిజాన్ని నిర్భీతిగా చూపించడంలో దమ్మున్న ఛానల్‌గా పేరుగాంచిన ఏబీఎన్ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు. హృదయాలను కదిలించే మానవీయ కథనాలు, అవినీతిపరుల పాలిట సింహస్వప్నంలాంటి పరిశోధనాత్మక కథనాలు, నిక్కచ్చి రాజకీయ విశ్లేషణలతో తెలుగు వీక్షకులకు అభిమాన పత్రికగా ఆంధ్రజ్యోతి, ఇష్టపడే ఛానల్‌గా ఏబీఎన్ నిలిచాయి. వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు’’ అని లోకేష్ పేర్కొన్నారు.