విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్తోని హిల్ నెంబర్3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మధురవాడలోని ఐటీ పార్కు చేరుకున్న మంత్రి నారా లోకేశ్కు మంగళవాయిద్యాలతో సంస్థ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకవల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతోపాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాస్ డాక్లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయనుంది.
తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయంవల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది. కార్యక్రమంలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, పి గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఎన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.