- అందుకు కావాల్సిన మౌలిక వసతులపై దృష్టిసారించాలి
- మౌలిక వసతుల కల్పనకు నిర్దుష్ట ప్రణాళికలు రూపొందించండి
- ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులకు లోకేశ్ దిశానిర్దేశం
విశాఖపట్నం (చైతన్యరథం): రాబోయే కాలంలో విశాఖ రీజియన్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇందుకు కావాల్సిన మౌలిక వసతులపై నిర్దుష్ట ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో విశాఖ కలెక్టరేట్ మీటింగు హాల్లో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖపట్టణం, అనకాపల్లి, విజయగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన రీజియన్ అభివృద్ధి, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం దశా దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బెంగళూరు, పుణెలాంటి నగరాల్లో ఉండే ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా చూడాలని, విస్తారమైన రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. “విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి. 30 ఏళ్ల భవిష్యత్తును ఊహించి ప్రణాళికలు రూపొందించాలి. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయంతో కూడిన మేధోపరమైన చర్చ జరగాలి” అని మంత్రి పేర్కొ న్నారు. వివిధ కంపెనీలు, అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్న రీజియన్ లో 5లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది.
కాబట్టి ఇక్కడి నేతలు, అధికారులు నిర్దుష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందిలేని విధంగా మిషన్ మోడ్లో అభివృద్ధి జరగాలని, ప్రజామోదానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో విశాఖ రీజియన్ లో ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు అనువైన ల్యాండ్ బ్యాంకులను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. సమావేశంలో ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, శాసన సభ విప్ గణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాన్జీ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, రాంసుందర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండర్కర్, వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, విశాఖపట్నం జేసీ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.