- కాసుల కక్కుర్తితో కల్తీకి తెరలేపిందే జగన్ రెడ్డి
- కల్తీ బ్రాండ్లను మార్కెట్కు తీసుకొచ్చిందీ జగనే
- ఎన్ఫోర్స్మెంట్ పనితీరుతోనే కల్తీ మద్యం పట్టుకున్నాం
- శవ రాజకీయం కోసమే
- కల్తీ మద్యం ఆరోపణలు
- ప్రజలే బాటిల్ స్టేటస్ తెలుసుకునేలా ఏపీటాట్స్ యాప్ తెస్తున్నాం
- కల్తీ మద్యం కేసులో ఎవరున్నా, ఎంతటి వారున్నా వదిలిపెట్టం
- రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి
విజయవాడ (చైతన్య రథం): కల్తీ మద్యంపై వైసీపీ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ అతిధి గృహంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా మొకలకలచెరువులో కల్తీ మద్యం కేసును విచారిస్తున్నాం. 23మంది నిందితులను గుర్తించి, 14మందిని అరెస్టు చేశాం. సూత్రధారి జనార్ధన్ రావు గన్నవరం ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. భవానీపురంలో మరో కేసును గుర్తించాం. అక్కడ 12మందిని నిందితులుగా గుర్తించి 5గురిని అరెస్ట్ చేశాం. నలుగురికి పీటీ వారెంట్ ఇచ్చాం. జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తేలడంతో అతని కోసం గాలిస్తున్నాం. కల్తీమద్యం కేసును నాలుగు బృందాలు విచారిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఆయా బృందాలు నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. జయచంద్రారెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తించగానే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, తెనాలికి చెందిన వైసీపీ బూత్ కన్వీనర్ ఇదే స్కాంలో ఉంటే ఎందుకు సస్పెండ్ చేయలేదో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, మల్లాది విష్ణులాంటి వారు తమ కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు తీశారు. వారిని సస్పెండ్ చేయకపోగా పదవులివ్వడమే జగన్ రెడ్డి నైతికతా? అని ప్రశ్నించారు. కల్తీ మద్యాన్ని ప్రజలు గుర్తించేలా ఏపీటాట్స్ యాప్ రూపొందించామని, బాటిల్పై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. తయారైన చోటు, బ్యాచ్, డిపో, ఏ షాపునకు చేరింది అనే ప్రతి వివరం అందులో ఉంటుందని స్పష్టం చేశారు.
కల్తీ వ్యాపారంపై ట్రాకింగ్ విధానంతో పూర్తి నిఘా పెట్టామని, గత ఐదేళ్లు ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని జగన్రెడ్డి నాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశాం కనుకే.. మెరుగైన పనితీరుతో రెండుచోట్ల కల్తీ మద్యాన్ని గుర్తించామన్నారు. సేల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న కారణంగానే ప్రస్తుత స్కాం బయటపడిందన్నారు. గత వైసీపీ హయాంలో సరిహద్దుల్లో అక్రమ మద్యం రవాణా ఎక్కువగా ఉండేదని, పొరుగు రాష్ట్రాలకంటే ఇక్కడ ఎక్కువ ధరలు ఉండటమే అందుకు కారణమన్నారు. నేడు ధరలు సమానం చేయడంతోపాటుగా, క్వాలిటీ మద్యం అందుబాటులోకి తెచ్చి.. అక్రమ రవాణా నిర్మూలించినట్టు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈఎన్ఏ, రెక్టిఫైడ్ స్పిరిట్ ఉందంటూనే.. ఏపీలో కల్తీ లేకుండా చూస్తున్నామన్నారు. నవోదయం 2.0 ద్వారా నాటు సారా పూర్తిగా నిర్మూలించామని, 21 జిల్లాలను ఇప్పటికే సారారహిత జిల్లాలుగా మార్చామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రతి బాటిల్ను 13సార్లు పరీక్షిస్తూనే.. డిపోలనుండి షాపులకు చేరిన తర్వాతా పరీక్షిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మద్యం విధానపై అత్యంత పారదర్శకంగా పనిచేస్తుంటే.. జగన్రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడని దుమ్మెత్తిపోశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా పారదర్శకంగా అమ్మామని చెబుతున్నారని, అప్పటివరకు ఉన్న మల్టీ నేషనల్ బ్రాండ్లు 2019 తర్వాత రాష్ట్రంలో ఎందుకు లేకుండాపోయాయో సమాధానం చెప్పాలన్నారు.
“ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని బ్రాండ్లు ఎలా వచ్చాయి? ప్రభుత్వ షాపుల పేరిట తన వారికి ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టడం నిజం కాదా? రవాణా మొత్తాన్ని తమ చేతుల్లో పెట్టుకుని.. రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మొత్తాన్ని సిండికేట్ చేసిన జగన్రెడ్డి నీతి వాక్యాలు వల్లించడం హాస్యాస్పదం” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ అని ఆరోపణలు చేయడం కాదు.. అది నిరూపించాలి. సాధారణ మరణాలను సైతం మద్యానికి లింక్ చేస్తున్నారు. చనిపోయిన ప్రతి కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోస్టుమార్టం చేస్తున్నాం. ఎవరు ఎక్కడ ఎలా చనిపోయినా మద్యానికి లింక్ చేయమని జగన్రెడ్డి వైసీపీ నేతలకు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. శవ రాజకీయాలకు అలవాటుపడిన జగన్రెడ్డి తన విధానం మార్చుకోవాలని, వైసీపీ అరాచకాలను చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలను ఉపేక్షించేది లేదంటూనే.. కల్తీ మద్యం కేసుల్లో ఎంతటివారున్నా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గుడ్డకాల్చి మొహానవేసి పారిపోతామంటే.. అలాంటివాళ్లను ఎన్డీయే ప్రభుత్వం వదిలిపెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్వరంతో హెచ్చరించారు.