- సౌత్ ఆఫ్రికాలో ఆ వ్యాపారం చేసింది తమరి బినామీలే
- జయచంద్రా రెడ్డి వైసీపీ కోవర్టు
- కల్తీ మద్యం మరణాలు, వ్యాపారంపై జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా?
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్
మంగళగిరి (చైతన్య రథం): గత ఆరేళ్లుగా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారడానికి కారణం జగనేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కల్తీ మద్యానికి మూలకారణం జగనేనని, దాన్ని ప్రోత్సహించిందీ జగనేనన్నారు. దీన్ని ఖండించే ధైర్యం జగన్కు ఉందా? అని నిలదీశారు. మీ నాయకుడు మల్లాది విష్ణు బార్ లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోతే, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్నించారు. గతంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు కాకాణి గోవర్ధన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మద్యంలో భాగస్వాములైనది నిజం కాదా? వారిపై కేసులున్నది నిజం కాదా? వారిపై వైసీపీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే, ఆ కేసును తప్పుదారి పట్టించినది మీరు కాదా? అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కానీ, కల్తీమద్యం గురించి వివరాలు తెలిసిన వెంటనే సంబంధిత వ్యక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. మీ పార్టీ కోవర్ట్ అయిన జయచంద్రారెడ్డిపై ప్రభుత్వం లుక్అవుట్ నోటీసులుజారీచేసి, పార్టీనుంచి సస్పెండ్ చేసింది. మీరు ఎప్పుడైనా అలా చేశారా? జయచంద్రారెడ్డి ఎక్కడ తల దాచుకున్నాడో జగన్కు తెలియదా? వైసీపీ కోవర్ట్ జయచంద్రారెడ్డి, మీ సునీల్రెడ్డి, అనిల్రెడ్డి క్యాంప్ తలదాచుకున్నది నిజం కాదా? వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్రెడ్డి జగన్ బినామీలు కాదా? కల్తీ మద్యంపై కేసులు వేయగానే వీరంతా సౌత్ ఆఫ్రికాకు పరారయ్యారని వర్ల రామయ్య ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి చంద్రబాబు చర్యలు చేపట్టారు, కానీ మీరు అలా చేశారా? అని జగన్ను నిలదీశారు. మీ చెత్త – ” పత్రికల్లో కూటమి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, సీఎం చంద్రబాబును ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వర్ల మండిపడ్డారు. మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని హెచ్చరించారు. పెద్దిరెడ్డి తన తమ్ముడిని గెలిపించు కోవడానికి జయచంద్రారెడ్డిని ఎన్నికల ముందు టీడీపీలో వైసీపీ కోవర్ట్ పనిచేయించారని ఆరోపించారు. జగన్ పాలనలో కల్తీ మద్యంపై ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. దానివల్ల 30 వేలమంది పేదలు మరణించారని ఆరోపించారు. మీరు సరఫరా చేసిన మద్యంలో విషపూరిత పదార్థాలున్నట్టు చెన్నై, బెంగళూరు ల్యాబ్లు నిర్ధారించింది నిజం కాదా? అప్పుడు బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు. ఏలూరులో మద్యం తాగి ఒక వ్యక్తి చనిపోతే, అది కల్తీ మద్యంగా ప్రచారం చేశారు. కానీ ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అది కల్తీ మద్యం కాదని నిర్ధారించింది. దీనిపై మీ సమాధానం ఏమిటని జగన్ ను ప్రశ్నించారు. కల్తీ మద్యం సరఫరాకు మూలవిరాట్ మీరేనని మేము చెబుతున్నా మని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని జగన్కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, కల్తీ మద్యం వ్యవహారంలో ఎంతటి వారైనాసరే, వారిని వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్ల రామయ్య స్పష్టం చేశారు.