- సమస్యల పరిష్కారానికి సర్కారు ఎప్పుడూ సిద్ధమే
- ఉపాధ్యాయులకు భరోసానిచ్చిన మంత్రి నారా లోకేశ్
- ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం
- ఇందుకు ప్రతి ఉపాధ్యాయుడి సహకారం అవసరం
- అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో లోకేశ్ భేటీ
- మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయులు
- విద్యార్థులకు బాగా చదువు చెబితే అదే పెద్ద గిఫ్టన్న మంత్రి
ఉండవల్లి (చైతన్య రథం): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చించుకుని మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ భరోసానిచ్చారు. ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను (మ్యూచువల్, స్పౌజ్) విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న భాషా పండితుల సమస్యను పరిష్కరించడంపట్ల మంత్రి నారా లోకేశ్ను ప్రత్యేకంగా కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తిచేశాం. వచ్చే నాలుగేళ్లపాటు ఫలితాలపైనే దృష్టిసారిస్తాం. గత ప్రభుత్వం మాదిరిగా విద్యార్థులను డ్రాప్ బాక్స్లో పెట్టి దొంగలెక్కలు చూపబోం. పారదర్శకంగా వ్యవహరిస్తాం. విద్యాశాఖను ఛాలెంజింగ్ తీసుకున్నాం. ఏపీలో విద్యావ్యవస్థను నెం1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలి. అభ్యసన ఫలితాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. దీనిని అధిగమించేందుకు కృషిచేస్తున్నాం. 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశాం. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. విద్యావ్యవస్థలో మార్పునకు మీ అందరి సహకారం కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులను తీర్చిదిద్దితే అదే పెద్ద గిఫ్ట్
టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు భాషా పండితులకు పదోన్న తులు కల్పించిన మంత్రి నారా లోకేశ్కు ధన్య వాదాలు తెలిపేలా రాష్ట్రవ్యాప్తంగా ‘థాంక్యూ లోకేష్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు మంత్రి స్పందిస్తూ.. అలాంటి కార్యక్రమాలేవీ వద్దని, విద్యార్థులకు చదువు బాగా చెబితే అదే పెద్ద గిఫ్ట్ అని వారితో అన్నారు. “నేను ఏలూరు జిల్లాలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. నా భర్త కడపలో పనిచేస్తున్నారు. ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయిన వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ.. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బదిలీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయాం. ఇక బదీలీ కాదనే స్థిర నిర్ణయానికి వచ్చాం. ఈ సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ధైర్యంగా ఉండాలని, విద్యాశాఖ మంత్రి కచ్చితంగా అంతర్ జిల్లా బదిలీలు చేస్తారని చెప్పారు. అనుకున్నట్లుగానే అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అంతర్ జిల్లాల బదిలీలు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎన్నో ఏళ్లు పడుతుంది. ఎప్పటికో అవుతుందిలేనని భావిం చాం. నిర్దుష్ట సమయంలోనే నోటిఫికేషన్ రావడం, జీవో రావడం జరిగిపోయింది. మేం స్కూల్లో కూడా జాయిన్ అయ్యాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఉపాధ్యాయురాలు బి లక్ష్మీ ప్రసన్న అన్నారు.
“భాషా పండితులకు పదోన్నతలు కల్పించి.. విజయదశమి రోజున మా జీవితాల్లో వెలుగులు నింపారు. మీకు కృతజ్ఞతలు. దశాబ్దాల కలను సాకారం చేశారంటూ భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఏ కొండయ్య మంత్రి లోకేశ్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరాజు, జనరల్ సెక్రటరీ బి హైమారావు, ఫైనాన్షియల్ సెక్రటరీ జే శ్రీనివాస్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు సంపత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.